logo

మామిడి మిగిల్చిన నష్టం

మామిడి పంట సాగు చేస్తున్న రైతులు గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాలతో సాగుపై అయిష్టత చూపుతున్నారు. పెట్టుబడులు

Published : 07 Dec 2021 02:25 IST

ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి

2 వేల హెక్టార్లలో చెట్ల నరికివేత

మామిడి చెట్టును యంత్రంతో కోస్తున్న కూలీ

తిరువూరు, న్యూస్‌టుడే : మామిడి పంట సాగు చేస్తున్న రైతులు గత కొన్నేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తగ్గిన దిగుబడులు, గిట్టుబాటు ధర ఆశాజనకంగా లేకపోవడం వంటి కారణాలతో సాగుపై అయిష్టత చూపుతున్నారు. పెట్టుబడులు సైతం రాకపోవడంతో ఆర్థికంగా నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా మామిడికి బదులు అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. రెండు, మూడు దశాబ్దాల నాటి చెట్లను నిలువునా నరికివేయిస్తుండటంతో పంట సాగు విస్తీర్ణం తగ్గుతోంది.

తగ్గుతున్న విస్తీర్ణం

మెట్టప్రాంతమైన పశ్చిమకృష్ణా పరిధిలోని నూజివీడు, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో మామిడి పంట సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1.55 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, చీడపీడల ఉద్ధృతి, మంగు సమస్య వంటివి దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి.. మార్కెట్‌ ధరల హెచ్చుతగ్గుదల వల్ల ఆశించిన ధర లభించడం లేదు. గడిచిన పదేళ్లలో సుమారు 28 వేల ఎకరాల్లో చెట్లను తొలగించగా, గత మూడేళ్లలోనే 4 వేల ఎకరాల్లో తోటలను నరికించారు. రెండు దశాబ్దాలకు పైగా వయసు కలిగిన చెట్లను గుత్తగా విక్రయిస్తున్నారు. కొమ్మలను వంట చెరకు, పేపర్‌ పరిశ్రమలు, మొద్దులను చెక్క తయారీకి తరలిస్తున్నారు. తొలగించిన తోటల్లో జామ, నిమ్మ, సుబాబుల్‌, పామాయిల్‌, మెట్ట, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు.

గిట్టుబాటు ధర లేకనే

ఏటా సీజన్‌ ప్రారంభంలో టన్ను బంగినపల్లి రూ.60 వేలు, తోతాపురి రూ.50 వేల వరకు ధర పలికి, కోతలు ఊపందుకోగానే అమాంతం ధర పతనమవుతోంది. వ్యాపారులు, దళారులు తమ ఇష్టానుసారంగా ధర నిర్ణయిస్తున్నారు. ఈ ఏడాది కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైన తరువాత టన్ను రూ.30 వేలకు పడిపోగా, చివరికి రూ.15 వేలకు చేరింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో మార్కెట్‌ను దళారులు శాసిస్తున్నారు. హెక్టారుకు సగటున 10 నుంచి 12 టన్నుల వరకు రావాల్సిన దిగుబడి ప్రస్తుతం 4 నుంచి 8 టన్నులు మాత్రమే వస్తుంది. ఎరువులు, పురుగుల మందుల ధరలు పెరగడంతో సాగు కష్టంగా మారింది.

అటకెక్కిన అనుబంధ పరిశ్రమలు

నూజివీడు డివిజన్‌ పరిధిలో అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలు అటకెక్కాయి. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు గుప్పించడానికి ప్రచారాస్త్రంగా మారింది. పండ్ల రసం, ఒరుగులు, పచ్చళ్లు, తాండ్ర పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పితే రైతులకు తగిన గిట్టుబాటు ధర లభించడానికి అవకాశం ఉంది. మామిడి నిల్వ చేసి ధర ఆశాజనకంగా ఉన్న తరుణంలో విక్రయించడానికి అవసరమైన శీతలగిడ్డంగుల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. మామిడి రైతులను ప్రోత్సహించడానికి ఉద్యానశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల మంజూరు ప్రస్తుతం నిలిచింది. తోటల అభివృద్ధి, సూక్ష్మ, బిందు సేద్యం, పండ్ల తోటల విస్తరణ, మొక్కల సరఫరా, పెట్టుబడులపై రాయితీ, ప్యాక్‌ హౌస్‌లు, రిఫర్‌ వ్యానులు, ప్రోసెసింగ్‌ యూనిట్ల కోసం రైతులు చేసిన దరఖాస్తులు బుట్టదాఖలయ్యాయి.

పామాయిల్‌ సాగు చేస్తున్నాం

గిట్టుబాటు ధర రాకపోవడంతో చిట్టేల సమీపంలో ఉన్న మామిడి తోటలో చెట్లను ఇటీవల తొలగించాం. వాటి స్థానంలో పామాయిల్‌ సాగు చేపట్టి అంతర పంటగా మిర్చి, మెట్ట పంటలు సాగు చేస్తున్నాం. పెట్టుబడులు, రవాణా, కూలీ ఖర్చు బాగా పెరిగింది. మార్కెట్‌లో పంటకు ఆశించిన ధర రాకపోవడంతో మామిడిపై ఆసక్తి తగ్గింది. - ఎస్‌.శివశంకర్‌, రైతు, తిరువూరు

ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి

మామిడి మార్కెట్లపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలి. మిగిలిన పంటల మాదిరి మద్దతు ధర నిర్ణయించాలి. ఉద్యానశాఖ ద్వారా పథకాలను సకాలంలో మంజూరు చేయాలి. నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాలి. రైతులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. లేకపోతే మామిడి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. 18 ఎకరాల్లో చెట్లను నరికించాం. మెట్ట, వాణిజ్య పంటలు సాగు చేస్తున్నాం. - కె.సుబ్బారావు, రైతు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని