logo
Published : 06 Aug 2022 02:44 IST

బాలల పోషణ బలహీనం

గుర్తించడంలో యంత్రాంగం విఫలం

ఖాళీగా పౌష్టికాహార పునరావాస కేంద్రం

ఈనాడు- కర్నూలు, వైద్యాలయం- న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో భావితరం బక్కచిక్కుతోంది. పౌష్టికాహార లోపంతో చిన్నారులు బరువు తగ్గి రక్తహీనత బారిన పడుతున్నారు. ఇలాంటి వారికి ఉచిత వైద్య సేవలు అందించే కేంద్రం ఉంది. క్షేత్రస్థాయిలో శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బక్కచిక్కిన భావితరం సేవలు అందుకోలేకపోతోంది.

24 గంటల పాటు సేవలు

పునరావాస కేంద్రంలో 24 గంటలు వైద్యం అందిస్తారు. ఆరోగ్యం మెరుగు పడటానికి ఔషధాలు.. ఉచితంగా పౌష్టికాహారం ఇస్తారు. సంబంధిత పిల్లల తల్లికీ ఉచిత భోజన సదుపాయంతోపాటు నిత్యం రూ.150 చొప్పున ఇస్తారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు రోజుకో మెనూ చొప్పున ఆహారం అందజేసి నిర్దేశించిన 14 రోజుల్లో పిల్లల బరువు పెరిగేలా చూడటమే ఈ కేంద్రం ప్రత్యేకత. ప్రస్తుతం జీజీహెచ్‌లోని కేంద్రంలో ఇద్దరు న్యూట్రిషియన్లకు ఒక్కరే ఉన్నారు. పౌష్టికాహారం వండటానికి ఇద్దరు వంట మనుషులకు ఒక్కరే ఉన్నారు. వీటిని భర్తీ చేసేందుకు ప్రతిపాదనలు వెళ్లినా నియామకాలు జరగలేదు.

ఎందుకు బక్కచిక్కుతున్నారంటే

పునరావాస కేంద్రానికి వచ్చే పిల్లల ఆరోగ్య పరిస్థితి పరిగణనలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. చిన్నారులు ఎందుకు పౌష్టికాహార లేమితో ఇబ్బంది పడుతున్నారో గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో ఏటా 60వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. చాలా మంది గర్భిణుల్లో హిమోగ్లోబిన్‌ 8 శాతం కంటే తక్కువగా ఉండటం సమస్యకు ప్రధాన కారణం అవుతుంది. గిరిజన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.

లోపించిన సమన్వయం

* ఉమ్మడి కర్నూలు జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య, 20 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. బరువు తక్కువ, రక్తహీనత, న్యూమోనియా, ఫిట్స్‌ తదితర సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు ఆయా కేంద్రాలకు తీసుకెళ్తుంటారు. అలాంచి చిన్నారులను సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార పునరావాస కేంద్రానికి పంపించాలి. ఎక్కడా ఈ ప్రక్రియ కొనసాగడం లేదు. కేవలం సర్వజన వైద్యశాలలో గుర్తించిన చిన్నారులనే కేంద్రానికి రిఫర్‌ చేస్తున్నారు.

* 2012లో 20 పడకలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ప్రస్తుతం ఐదు మంది చికిత్స పొందుతున్నారు. క్షేత్రస్థాయి నుంచి రిఫరల్‌ కేసులు తక్కువగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఆరోగ్య కార్యకర్త (ఏఎన్‌ఎం), ఆశాలు బాధ్యత తీసుకోవడం లేదు. అదేవిధంగా వైద్య ఆరోగ్యశాఖ, అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడమే సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఖర్చుకాక నిధులు వెనక్కి

* జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద పౌష్టికాహార పునరావాస కేంద్రానికి ఏటా రూ.10 లక్షలకుపైగా నిధులు అందుతాయి. క్షేత్రస్థాయి నుంచి రిఫరల్స్‌ తక్కువగా ఉండటంతో నిధులు ఖర్చు కావడం లేదు. రెండేళ్లకు సంబంధించిన రూ.8 లక్షలకు పైగా నిధులు వెనక్కి మళ్లినట్లు సమాచారం.

* చిన్నారులతోపాటు తల్లులకు వేతన నష్టపరిహారం కింద అందించే నగదు పెండింగ్‌ ఉంది. సుమారు రూ.3 లక్షల వరకు అందించాల్సి ఉంది. బకాయిలకు సంబంధించి చెక్కు ఇవ్వాలా.. నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయాలా అనే ప్రణాళికలో అధికారులున్నారు.


ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన ముషిరకు 38 నెలలు.. 14 కిలోల బరువు ఉండాల్సి ఉండగా.. 8 కిలోల లోపే ఉంది. పునరావాస కేంద్రంలో చికిత్స పొందుతోంది. ఈ బాలిక ఎదుగుదలను పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో గుర్తించలేదు. లోపాన్ని తల్లిదండ్రులే గుర్తించి వైద్యం కోసం కర్నూలు సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. ఇక్కడి వైద్యులు గుర్తించి పునరావాస కేంద్రానికి పంపించారు.


నంద్యాలకు చెందిన అనవిక పౌష్టికాహారలేమితో ఇబ్బంది పడుతోంది. దీంతోపాటు కాల్షియం లోపం ఉండటంతో ఎముకలు విరిగిపోతున్నాయి. 31 నెలల ఈ చిన్నారి 14 కిలోలు ఉండాలి..కానీ 7.5 కిలోలే ఉంది. తల్లి నేరుగా చిన్న పిల్లల విభాగానికి తీసుకొచ్చారు. తొలుత బాల స్వాస్థత (డైస్‌ కేంద్రం)లో చికిత్స అందించి రిఫరల్‌ కేసుగా పునరావాస కేంద్రానికి పంపారు. మొదట్లోనే క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యను గుర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.


 

Read latest Kurnool News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని