logo

దేవరా.. గట్టెక్కిస్తావా

ఈ పేరు వింటేనే ముందుగా బన్ని రోజు జరిగే కర్రల సమరం గుర్తుకొస్తుంది. సంప్రదాయం ఓ వైపు.. దేవతామూర్తులను దక్కించుకోవాలన్న సంకల్పం మరో వైపు.. మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి.

Published : 05 Oct 2022 02:32 IST

 నేటి అర్ధరాత్రి బన్ని ఉత్సవం
పెద్దఎత్తున అవగాహన సదస్సుల నిర్వహణ


అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ (పాత చిత్రం)

ఆలూరు, న్యూస్‌టుడే: దేవరగట్టు.. ఈ పేరు వింటేనే ముందుగా బన్ని రోజు జరిగే కర్రల సమరం గుర్తుకొస్తుంది. సంప్రదాయం ఓ వైపు.. దేవతామూర్తులను దక్కించుకోవాలన్న సంకల్పం మరో వైపు.. మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. దసరా రోజున దేవరగట్టులో జరిగే ఉత్సవం రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది. బన్ని రోజు అర్ధరాత్రి వేలాది మంది చేతుల్లో కర్రలు నృత్యాలు చేస్తాయి. కొండపై నుంచి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తెచ్చే సమయంలో జరిగే కర్రల సమరంలో చాలామంది గాయపడుతారు. దీనిని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలి వస్తారు. బుధవారం అర్ధరాత్రి జరగనున్న బన్ని ఉత్సవం నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
సదస్సులతో మార్పు
వందలాది మంది గాయపడుతుండటంతో మానవహక్కుల సంఘం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్రలు తీసుకెళ్లకుండా ప్రజలు పండగను ప్రశాంతంగా జరుపుకొనేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏటా రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కర్రల సమరంతో జరిగే నష్టాన్ని ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. ఫలితంగా దేవరగట్టుకు కర్రలు తీసుకెళ్లే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది సైతం ఆలూరు, హొళగుంద, హాలహర్వి మండలాల్లోని పలు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు.
కెమెరాలతో నిఘా..
బన్ని పర్వదినం రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో కెమెరాలతో నిఘా ఉంచనున్నారు. ఉత్సవం మాటున ఎవరైనా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు గట్టు చుట్టూ పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు డ్రోన్‌ కెమెరాలు నిరంతరం విహంగ వీక్షణం ద్వారా దృశ్యాలను చిత్రీకరిస్తాయి. దీనికితోడు దాదాపు వెయ్యి మందితో బందోబస్తు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని