logo

పుస్తక పుటలకు జగనన్న చెద

గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు.

Published : 24 Apr 2024 05:07 IST

గ్రంథాలయాలకు జమకాని సెస్సు
ఐదేళ్లలో ఒక్క కొత్త పుస్తకం కొనలే

కోడుమూరులో గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరింది. 10,462 పుస్తకాలు అందుబాటులో ఉండగా, 573 మంది పాఠకులు నమోదై ఉన్నారు. కొత్త భవన నిర్మాణానికి రూ.35 లక్షలు మంజూరైనా టెండర్లు దాఖలు కాకపోవడంతో అడుగులు ముందుకుపడటం లేదు.


కర్నూలు విద్య, డోన్‌ పట్టణం, కోడుమూరు, న్యూస్‌టుడే: గ్రంథాలయాల్లో పాఠకుల్ని సమస్యలు వేధిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో అభివృద్ధి పనులు జరగడం లేదు. పాఠకులకు కొత్త పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. ఏళ్ల నాటి పుస్తకాలకు రక్షణ లేకపోవడంతో బూజుపట్టేస్తున్నాయి. మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పుస్తకాలు లేక నిరుద్యోగులు ఉసూరుమంటున్నారు. గ్రంథాలయాలను డిజిటలైజేషన్‌ చేస్తామని ఎక్కడికక్కడ ఊదరగొట్టే మాటలు చెప్పిన జగన్‌ ఆచరణలోకి తీసుకురాలేదు. వైకాపా వచ్చినప్పటి నుంచి గ్రంథాలయాలకు గ్రాంట్స్‌ లేకపోవడంతో అరకొరగా వసూలవుతున్న సెస్సులతోనే కష్టంగా సిబ్బంది నెట్టుకొస్తున్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థతో పాటు 59 శాఖా గ్రంథాలయాలు, 160 బుక్‌ డిపాజిట్‌ కేంద్రాలు ఉన్నట్లు గ్రంథాలయశాఖ అధికారులు తెలిపారు. తెలుగు, ఆంగ్లం, హిందీ, ఉర్దూ తదితరాలకు సంబంధించి జిల్లాలో 6,01,059 పుస్తకాలు ఉండగా, జిల్లా కేంద్రంలో అయితే 70 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 70 వేల మంది పాఠకులు సభ్యత్వం పొందారు. ఉమ్మడి జిల్లాలో సొంత భవనాలున్న గ్రంథాలయాలు 29 ఉండగా, ఉచిత (రెంట్‌ ఫ్రీ) భవనాలు 12, అద్దె భవనాల్లో 19 గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. ఇందులో గ్రేడ్‌-1 గ్రంథాలయం ఆదోనిలో, గ్రేడ్‌-2 గ్రంథాలయాలు మద్దికెర, శ్రీశైలం, డోన్‌, నంద్యాల, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఆలూరు ప్రాంతాల్లో ఉన్నాయి. మిగతావి గ్రేడ్‌-3 కింద కొనసాగుతున్నాయి.

గ్రాంట్ల కోత

ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు రూ.6 కోట్లు ఇవ్వాలి. వైకాపా మాత్రం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే అరకొర గ్రాంట్లతో పాటు గ్రంథాలయాలకు వచ్చే సెస్సుతోనే వేతనాలు, వసతులకల్పనతో పాటు భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థకు ప్రభుత్వం నుంచి రూ.7 కోట్లు రావాల్సి ఉండగా, ప్రభుత్వానికి నివేదించి రెండేళ్లు అవుతున్నా...నేటికి ఒక్క రూపాయి కూడా రాలేదు.

రూ.కోట్లల్లో బకాయిలు

కర్నూలు నగరపాలక సంస్థతోపాటు పురపాలికలు, పంచాయతీల్లో వసూలవుతున్న ఇంటిపన్నులు 8 శాతం గ్రంథాలయాలకు చెల్లించాలి. గ్రంథాలయానికి రావాల్సినవి పూర్తిస్థాయిలో అందడం లేదు. 2019 నుంచి కర్నూలు నగరపాలక సంస్థ నుంచి రూ.6,37,12,262, పురపాలికల నుంచి రూ.80,16,292, పంచాయతీల నుంచి రూ.14,82,303 సెస్సు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

అప్పుట్లో 10.. ఇప్పుడు 4

తెదేపా హయాంలో పదిచోట్ల గ్రంథాయల భవనాల నిర్మాణాలకు గానూ సుమారు రూ.4 కోట్లు ఖర్చు చేస్తే వైకాపా వచ్చాక నాలుగు భవనాల నిర్మాణాలకు రూ.1.50 కోట్లు మాత్రమే కేటాయించారు. మూడుచోట్ల భవనాల నిర్మాణాలు ఇంకా జరుగుతున్నాయి. కోడుమూరులో రూ.40 లక్షలతో చేస్తున్న పనులు పునాదులకే పరిమితమయ్యాయి.

నాలుగేళ్లలో 40 వేలే.?

2019 ఏడాది నుంచి ఇప్పటివరకు ఒక్కసారే గ్రంథాలయాలకు వైకాపా పుస్తకాలను కొనుగోలు చేసింది. 2021-22 ఏడాదిలో రూ.37 లక్షలు విలువైన 40 వేల పుస్తకాలు కొనుగోలు చేసి మండల కేంద్రంలో ఉన్న లైబ్రరీకి 6 వేల నుంచి 7 వేల వరకు సరఫరా చేసింది. తెదేపా హయాంలో పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను సుమారు రూ.70 వేల వరకు కొనుగోలు చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని