logo

డీసీసీబీ తాత్కాలిక సీఈవోపై వేటు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది.

Published : 24 Apr 2024 05:34 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు తాత్కాలిక ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) శివలీలపై వేటు పడింది. కోడ్‌ ఉల్లంఘించి పక్షం రోజులైనా ఆమెపై బ్యాంకు ఛైర్‌పర్సన్‌ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డా.సృజన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా ఆమే రంగంలోకి దిగి శివలీలను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దీర్ఘకాలిక సెలవులో వెళ్లి

డీసీసీబీ తాత్కాలిక సీఈవో శివలీల తన వ్యక్తిగత కారణాలతో ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్‌ 6వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో విధుల్లో చేరేముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి.. కనీసం జిల్లా సహకార అధికారి (డీసీవో) అనుమతైనా తీసుకోవాలి. డీసీవో అనుమతి తీసుకోకుండా.. ఎన్నికల కోడ్‌ లెక్క చేయకుండా డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ ఎస్‌.వి.విజయ మనోహరిని కలిసి నేరుగా విధుల్లో చేరారు. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనే అంటూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి బృందం, జిల్లా ఎన్నికల అధికారి నిర్ధారించారు.

ఆదేశాలు భేఖాతరు

కోడ్‌ ఉల్లంఘనపై 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని డీసీసీబీ తాత్కాలిక సీఈవోను కలెక్టర్‌ ఆదేశించారు. ఆమె వివరణ ఇచ్చినా కలెక్టర్‌ సంతృప్తి చెందలేదు. తాత్కాలిక సీఈవో శివలీలను విధుల నుంచి తప్పించాలని.. ఆ స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ డీసీవో రామాంజనేయులుకు ఉత్తర్వులు పంపారు. కలెక్టర్‌ ఉత్తర్వులను ఆయన ఆప్కాబ్‌ ఎండీకి నివేదించారు. కలెక్టర్‌ ఆదేశాలు అమలు చేయాలని, తాత్కాలిక సీఈవోగా ఇదివరకే విధులు నిర్వహించిన విజయకుమార్‌కు బాధ్యతలు అప్పగించాలని, శివలీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డీసీసీబీ ఛైర్‌పర్సన్‌కు సూచిస్తూ ఆప్కాబ్‌ ఎండీ ఉత్తర్వులు పంపారు. ఛైర్‌పర్సన్‌, తాత్కాలిక సీఈవో ఇరువురు ఓకే సామాజిక వర్గం కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని బ్యాంకు ఛైర్‌పర్సన్‌ శివలీలకు తాఖీదులు ఇవ్వడం గమనార్హం. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్‌ కోరగా.. ఛైర్‌పర్సన్‌ ఏకంగా 30 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొనడం గమనార్హం. ఆలోగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని.. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోకుండా కాపాడేందుకే ఇలా తాఖీదులు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. తాత్కాలిక సీఈవోగా విజయకుమార్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని