logo

పండుటాకులతో జగన్‌ పింఛనాట

సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు.

Updated : 30 Apr 2024 06:29 IST

 న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

సామాజిక పింఛన్ల వ్యవహారంలో జగన్నాటకం కొనసాగుతోంది.. ఇంటింటికీ వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా ఉండేందుకు ఎన్ని రకాలు కుట్రలు, కుతంత్రాలు పన్నాలో అన్నింటినీ అమలు చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వెళ్లలేము మహాప్రభో ఇంటి దగ్గరే ఇవ్వాలని పింఛనుదారులు వేడుకుంటున్నా చెవికెక్కించుకోవడం లేదు. బురద జల్లడమే మా పని.. రాజకీయ లబ్ధే మా వ్యూహం అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇంటింటికీ సరిపడా సిబ్బంది ఉన్నా పంపిణీకి మోకాలడ్డుతున్నారు. బ్యాంకులకు వెళ్లండి తిప్పలు పడండి అంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఒంటరిగా బ్యాంకులకు వెళ్లలేనివారు వేలల్లో ఉంటారు. ఇలాంటి వృద్ధులందరూ మరొకరిని వెంట తీసుకుని బ్యాంకులకు వెళ్లాలి. ఒక్కొక్కరు రూ.200-400 రవాణా ఖర్చు భరించాలి. తిండి ఖర్చు అదనం. ఒకరకంగా చూస్తే ఇదంతా వారిలో ఆందోళన నింపే ప్రయత్నమే అవుతుంది..

 ఏప్రిల్‌లో ఏడిపించారు 

లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను పంపిణీ చేయకుండా మండే ఎండల్లో గ్రామ, వార్డు సచివాలయాలకు రప్పించడంతో వృద్ధులు యాతన పెట్టారు.

మేలో  ముచ్చెమటలు

పింఛనుదారుల బ్యాంకుఖాతాల్లో నగదు జమచేస్తామంటూ ఇళ్లకు ఎక్కడో దూరంలో ఉండే బ్యాంకుల చుట్టూ తిప్పే కుట్రకు  తెర తీశారు.

ఇంటింటికి పంపిణీ చాలా సులువు

గ్రామ, వార్డు సచివాలయాల్లో 7 నుంచి 9 వరకు  సిబ్బంది ఉన్నారు. ఒక్కో ఉద్యోగి 47 పింఛన్లు మాత్రమే పంచాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చు. ఇంత సులభతరంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వృద్ధులను బ్యాంకుల చుట్టూ తిప్పేలా ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనిపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.

1,88,096 మంది బ్యాంకుకు వెళ్లాల్సిందే

 కర్నూలు జిల్లాలో 2,46,340 మంది పింఛనుదారులు ఉండగా వారిలో 58,244 మంది నడవలేనివారు, మంచానికే పరిమితమైనవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునేవారు ఉన్నారు. వీరికి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించనున్నారు. మిగిలిన 1,88,096 మందికి మే ఒకటో తేదీన డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా పింఛనుదారుల ఖాతాల్లో జమ చేస్తారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి, పింఛను సొమ్ము ఖాతాలకు వెళ్లకుండా వెనక్కు వస్తే అలాంటి వారికి మే 3వ తేదీన సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందిస్తారు. పింఛనుదారుల్లో అత్యధికులు వృద్ధులే ఉన్నారు. మొత్తం 16 రకాల పింఛన్లు పంపిణీ చేస్తుండగా అందులో ఒక్క వృద్ధాప్య పింఛన్లే ఉమ్మడి జిల్లాలో 2.41 లక్షలు ఉన్నాయి. వితంతు పింఛన్లు 1.34 లక్షలు, దివ్యాంగుల పింఛన్లు 58 వేలు ఉన్నాయి. మిగిలిన అన్ని కేటగిరీలవారు 33,736 మంది ఉన్నారు. అసలే వేసవి కాలం.. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వృద్ధులు తదితరులు బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకోవాలంటే నరకయాతనే.

ఎర్రటి ఎండ

బ్యాంకు సమయం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. ఈ సయమంలో ఎండ 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుంది.

పది కి.మీ. పరుగులు

మద్దికెర మండలంలో 8 గ్రామ పంచాయతీలు, మూడు మజరా గ్రామాలున్నాయి. మద్దికెర, పెరవలి గ్రామాల్లో మినహా మరే గ్రామంలోనూ బ్యాంకులు, ఏటీఎంలు లేవు. మండలంలో 4,867 మంది పింఛన్లు పొందుతున్నారు. వీరిలో రెండు వేల మందికి పైగా ఇతర గ్రామాల నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిందే. దీంతో ఈ సారి వీరందరికీ కష్టాలు తప్పేలా లేవు.


‘‘‘ మదనంతపురం నుంచి పెరవలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేదు.. ఈ దారిలో కనీసం ఆటోలు తిరగవు. బ్యాంకుకు వెళ్లేందుకు సుమారు 10 కి.మీ. వెళ్లాలి. ఇక్కడ 120 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు 10 కి.మీ దూరంలోని పెరవలికి వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు.  

 న్యూస్‌టుడే, మద్దికెర


ఉన్నది ఒక్కటే బ్యాంకు

నందవరం మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. 19 గ్రామ సచివాలయాల్లో 140 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. మండలంలో 7,157 మంది పింఛనుదారులున్నారు. వీరంతా మండల కేంద్రంలో ఉన్న కెనరా బ్యాంకులో డబ్బులు తీసుకోవాల్సిందే. గురజాలలో 449 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు.. వీరంతా 15 కి.మీ దూరంలో ఉన్న నందవరానికి వెళ్లాలిందే. మాచాపురంలో తొమ్మిది సచివాలయ సిబ్బంది ఉండగా.. 231 మంది లబ్ధిదారులున్నారు. ఒక్కో సిబ్బంది 25 మంది చొప్పున అందజేస్తే రెండు గంటల్లో పూర్తి చేయొచ్చు. ప్రతి పల్లెలో ఒక్క రోజులో పూర్తి చేయొచ్చు.. బ్యాంకులో జమ చేయడంతో వీరికి ఇబ్బందులు తప్పవు. - న్యూస్‌టుడే, నందవరం

మనుగడలో లేని ఖాతాలు

కౌతాళం మండలంలో మొత్తం 8,738 పింఛన్లున్నాయి. ఇందులో 500 మందికిపైగా బ్యాంకు ఖాతాల్లేని వారున్నారు. మండలంలో ఖాతాలున్నా అప్‌డేట్‌ లేనివారు (లావాదేవీలు లేనివారు) సుమారు 860 మంది ఉన్నారు. కౌతాళం 2 బదినేహాల్‌ 1, ఉరుకుంద 2, హాల్వి 1 చొప్పున ఆరు బ్యాంకులున్నాయి. ఖాతాలే సరిగా లేకుంటే డబ్బులు ఎలా తీసుకునేదని పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంబళనూరు గ్రామ సచివాలయం పరిధిలో 394 మంది పింఛనుదారులున్నారు. ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఒక్కో ఉద్యోగికి 131 పింఛన్లు వస్తాయి. వీరు ఇంటింటికి వెళ్లి రెండు గంటల్లో సులువుగా పంపిణీ చేయవచ్చు.

 న్యూస్‌టుడే, మంత్రాలయం గ్రామీణం


  ఖాతా పని చేయడం లేదు
- కౌట్లయ్య, గోనెగండ్ల

నేను ఎప్పుడో బ్యాంకు ఖాతా తీసుకున్నా. ప్రస్తుతం అది పని చేస్తుందో లేదో తెలియదు. ఆధార్‌ లింకు కావాలని అడుగుతున్నారు. ఆ ఖాతాకు లింకు అయ్యిందో లేదో తెలియదు. ప్రభుత్వం ఎప్పటి మాదిరిగా ఇంటింటికి వచ్చి పింఛను అందిస్తే మాలాంటి వారికి ఇబ్బందులుండవు.

న్యూస్‌టుడే, గోనెగండ్ల


 అంత దూరం వెళ్లే సరికి బ్యాంకు మూస్తారు
- ఈడిగ లక్ష్మీదేవి, కె.వెంకటాపురం

  మా గ్రామానికి మండల కేంద్రం దేవనకొండకు 12 కి.మీ. దూరం ఉంది. బస్సు సౌకర్యం లేదు. దేవనకొండలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, పత్తికొండలోని ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్నాయి. ఆధార్‌ అనుసంధానం  పత్తికొండలోని బ్యాంకు ఖాతాకు ఉంది. కె.వెంకటాపురం నుంచి పత్తికొండకు వెళ్లాలంటే 12 కి.మీ., దేవనకొండకు ఆటోలో చేరుకొని, అక్కడి నుంచి మరో 18 కి.మీ. పత్తికొండకు వెళ్లాల్సిఉంది. అక్కడికి వెళ్లే సరికి బ్యాంకు సమయం ముగుస్తుంది.ఒంటరిగా వెళ్లలేను. నాతో పాటు మరొకరి సాయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. 

 న్యూస్‌టుడే, దేవనకొండ


బ్యాంకు లేదు.. బస్సు రాదు...  
- రంగమ్మ, సూదేపల్లి (వెల్దుర్తి)

మా గ్రామానికి బస్సు రాదు.. బ్యాంకు వసతి లేదు. 11 కి.మీ. ప్రయాణించి వెల్దుర్తికి వెళ్లాలి. సూదేపల్లి నుంచి వెల్దుర్తికి వెళ్లాలంటే రూ.100 ఖర్చు అవుతుంది.   ఒక్కదాన్ని అంత దూరం వెళ్లలేను. తోడుగా మరొకరు రావాలి.. అదనపు భారం తప్పదు.

 న్యూస్‌టుడే, వెల్దుర్తి


ఖాతా వినియోగించక మూడేళ్లు
- లింగమ్మ, విరుపాపురం (హాలహర్వి)

బ్యాంకు ఖాతా వినియోగించక మూడేళ్లు అవుతోంది. ఇలాంటి సమయంలో పింఛను సొమ్ము జమచేస్తే డ్రా చేసుకొనేందుకు 16 కి.మీ. ఆటోలో ప్రయాణించాలి. బ్యాంకులో నిల్చోవడం సాధ్యం కాదు. మండుటెండలో ప్రయాణం కష్టసాధ్యం. వృద్ధులు తీవ్ర వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని