logo

ముస్లింలకు జగన్‌ ధోకా

తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్‌ మకాన్‌, దుల్హన్‌ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్‌ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్‌రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు.

Updated : 30 Apr 2024 06:28 IST

సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
మైనింగ్‌ వ్యాపారులపై వేధింపులు లేకుండా చూస్తా
‘ప్రజాగళం’లో చంద్రబాబు వెల్లడి

డోన్‌లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడికి స్వాగతం పలుకుతున్న మహిళలు

తెదేపా హయాంలో ముస్లిం మైనార్టీలకు న్యాయం చేశాం.. ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. ఉర్దూను రెండో భాషగా గుర్తించాం.. దుకాన్‌ మకాన్‌, దుల్హన్‌ లాంటి పథకాలు తెచ్చాం.. రంజాన్‌ తోఫా ఇచ్చి అండగా నిలిచా.. ఈ పథకాలన్నీ జగన్‌రెడ్డి రద్దు చేసి మైనార్టీలకు అన్యాయం చేశారు. నందికొట్కూరులో మసీదుకు వెళ్లి వస్తున్న మహిళ బురఖా ఎత్తి అవమానించిన వారిని ప్రశ్నిస్తే కొట్టారు. అదే తానుంటే అలాంటి వారి మక్కెలిరగ్గొట్టేవాడినని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మక్కా యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష సాయం అందిస్తాం.. షాదీఖానాల నిర్మాణం, మసీదుల మరమ్మతులు తెదేపా ప్రభుత్వంలోనే జరిగాయని గుర్తు చేశారు. డోన్‌ ‘ప్రజాగళం’ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యప్రకాశ్‌రెడ్డి కోసం ఒక బటన్‌, బైరెడ్డి శబరి కోసం మరో బటన్‌ నొక్కాలి. వీరి గెలుపు చూసి జగన్‌రెడ్డికి వెన్నులో వణుకు పుట్టాలి.’’ అని బాబు తెలిపారు.

 న్యూస్‌టుడే, డోన్‌, డోన్‌ పట్టణం, గ్రామీణం

బహిరంగ సభకు హాజరైన జనం

నందికొట్కూరు, నందికొట్కూరు గ్రామీణం, మిడుతూరు, న్యూస్‌టుడే : జన సంద్రమే ఇక్కడికి వచ్చిందా.. జనం జనం ప్రభంజనం.. ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. నేను నందికొట్కూరుకు అనేకసార్లు వచ్చినా ఇంతమంది జనాలను ఎన్నడూ చూడలేదని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ జన సంద్రాన్ని చూస్తే నందికొట్కూరు ప్రాంత ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు నాకు తోస్తోంది. 20 సంవత్సరాల చరిత్రను తిరగ రాయబోతున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వుడు నియోజకవర్గంలో మీరు కొట్టే దెబ్బతో వైకాపా గుండె పగలాలన్నారు.  సరికొత్త చరిత్ర రాసేందుకు నందికొట్కూరు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన నందికొట్కూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు.

అప్పులమంత్రి కథ ముసిగింది

పిట్టకథల మంత్రి, కట్టుకథల నాయకుడికి రాజకీయ సన్యాసం తప్పదు. కథలు చెప్పడంలో ఇక్కడున్న మంత్రి దిట్ట. ఆ మంత్రి వల్ల నియోజకవర్గం ఏమైనా బాగుపడిందా అంటే ఏమీ లేదు. ఆర్థిక మంత్రి కాస్త అప్పుల మంత్రిగా మారిపోయారు. ఈ పిట్టకథల మంత్రి చెప్పే కబుర్లు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరని, బుగ్గన ఆర్థికమంత్రో అప్పుల మంత్రో అర్థం కావడం లేదన్నారు.రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి... తాను మాత్రం మైనింగ్‌లో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. గజేంద్రరెడ్డి అనే బంధువు ప్రజల ఆస్తులన్నీ ఏనుగులా మింగేస్తున్నారు. మైనింగ్‌, క్రషింగ్‌ యూనిట్లను కబ్జా చేశారు. కర్ణాటక మద్యం తెచ్చి అమ్ముకుంటున్నార[ు. డోన్‌లో దోచుకున్న డబ్బుతో దేశంలో ఎక్కడెక్కడో ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. డోన్‌ ఎమ్మెల్యేగా సూర్యప్రకాశ్‌రెడ్డిని, ఎంపీగా శబరిని గెలిపించాలని, డోన్‌ సభ అదిరిపోయిందని, జగన్‌ ముఠా సీన్‌ మారిపోయిందన్నారు.

నందికొట్కూరు సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు


రౌడీమూకలకు ఓటేయొద్దు

కన్నీరుపెట్టుకున్న శబరి

నందికొట్కూరులో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న
నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా బాధ్యుడు
మాండ్రశివానందరెడ్డి వేదికపై నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి

నందికొట్కూరులో వైకాపా రౌడీమూకలకు ఓటు వేయొద్దని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి శబరి ప్రజలను కోరారు.రౌడీయిజంతో పాటు నటనలో దిట్టయిన బాలనటుడు సిద్ధార్థరెడ్డి మాటలు విని బెదిరిపోయేవారు ఎవరూ లేరన్నారు. బైరెడ్డి కుటుంబం, బైరెడ్డి రాజకీయ వారసత్వం నాదే అన్నారు. బైరెడ్డి వారసుడంటూ వచ్చిన వ్యక్తి ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మహిళలని కూడా చూడాకుండా, ఏమాత్రం గౌరవం లేకుండా దూషించడం దుర్మార్గం అని విమర్శించారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా వారు నాపై కేసులు పెడితే సహించాం. మా అమ్మను తిడితే ఎలా సహించాలి మీరే చెప్పండంటూ ప్రశ్నించారు. నందికొట్కూరు రౌడీల చేతుల్లో కాకుండా మంచి నాయకుల చేతుల్లో ఉండాలని, నారా చంద్రబాబునాయుడు మళ్లీ రావాలని కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేగా జయసూర్యను, ఎంపీగా తనను గెలిపించాలని కోరారు. వైకాపా వారు కోళ్లఫారం లాంటి ఇండోర్‌ స్టేడియం ఒక్కటి ఏర్పాటు చేసి మొత్తం అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకొంటున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని