logo

మారుతున్న రూపురేఖలు

సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలు కొన్ని సిద్ధమవుతున్నాయి.

Published : 14 Oct 2022 01:30 IST

‘మన ఊరు - మన బడి’లో 16 పాఠశాలలు సిద్ధం


హన్వాడ : రంగులు వేసేందుకు సిద్ధంగా ఉన్న ప్రాథమిక పాఠశాల

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం : సర్కారు బడుల్లో సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్య అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు - మన బడి’ తొలి విడతలో ఎంపిక చేసిన పాఠశాలలు కొన్ని సిద్ధమవుతున్నాయి. ఇన్నాళ్లు కళావిహీనంగా ఉన్న విద్యాలయాలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే మండలానికి కనీసం రెండు పాఠశాలలను సిద్ధం చేయాలని నిర్ణయించినా.. పలు కారణాలతో సాధ్యపడలేదు. జిల్లా కలెక్టర్‌ వెంకట్‌రావు విద్యాశాఖ అధికారులు, గుత్తేదారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. దీంతో తక్కువ పనులు చేయాల్సి ఉన్న 16 పాఠశాలలు సిద్ధమయ్యాయి. వాటికి రంగులు వేసే పనులకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 835 ఉండగా ‘మన ఊరు-మన బడి’ పథకం తొలి విడతలో 291 పాఠశాలలు ఎంపిక చేశారు. ప్రాధాన్య క్రమంలో కొన్ని పాఠశాలల్లో 12 రకాల అంశాలపై దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో ఈ పనులు కొంత మందకొడిగా సాగుతున్నా.. కొన్ని పాఠశాలల్లో సివిల్‌ వర్క్స్‌, భవనాలు, మరుగుదొడ్ల మరమ్మతులు, విద్యుదీకరణ తదితరాలు మాత్రం పూర్తయ్యాయి. రంగులు, డ్యూయల్‌ డెస్కులు, ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డులను రాష్ట్రస్థాయిలో బల్క్‌గా సేకరించనుండగా ఈ ప్రక్రియ టెండర్లు పూర్తయి పలు జిల్లాల్లో పనులు కూడా ప్రారంభమయ్యాయి. జిల్లాలోని పలు పాఠశాలల్లో సీలింగ్‌ ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లను కూడా అమర్చారు. వంట, తరగతి గదుల్లో పగుళ్లు ఉంటే లప్పంతో పూడ్చాలని గుత్తేదారులకు సూచించారు. కోయిలకొండ మండలంలో 3 పాఠశాలలు రంగలు వేసేందుకు సిద్ధంగా ఉండగా జడ్చర్ల మండలంలో 3, గండీడ్‌-2, హన్వాడ-2, రాజాపూర్‌-2, బాలానగర్‌-1, భూత్పూరు-1, మిడ్జిల్‌-1, మహబూబ్‌నగర్‌ గ్రామీణ మండలంలో ఒకటి చొప్పున మొత్తం 16 పాఠశాలలు సిద్ధంగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలకు బూడిద వర్ణం, ప్రాథమికోన్నత పాఠశాలలకు లేత గోధుమ, అన్ని పాఠశాలల పైకప్పులకు తెలుగు రంగు వేయనున్నారు. తరగతి లోపల, వెలుపల, భవనం, మరుగుదుదొడ్లు ఇలా ఆవరణ మొత్తం రంగులు వేస్తారు. తర్వాత అందమైన చిత్రాలు, పాఠ్యాంశాల్లోని పటాలు, చారిత్రక కట్టడాలు, గ్రామీణ జీవనం ప్రతిబింబించే బొమ్మలు గోడలపై గీయిస్తారు.

జిల్లాలో ఎంపికైన పాఠశాలలు 291
పనులు కొనసాగుతున్నవి 221
టెండర్ల దశలో ఉన్నవి 21
టెండర్లు పూర్తయినవి 49

మహబూబ్‌నగర్‌ : కోడూరు పాఠశాలలో ఏర్పాటుచేసిన కొళాయిలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని