logo

లక్ష్యం లేని చదువు వ్యర్థం

ప్రతి విద్యార్థి జీవితంలో మూడు లక్ష్యాలు ఎంచుకోవాలని మాజీ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ‘ఇంజినీరింగ్‌ విద్య ప్రాముఖ్యత’పై జేపీఎన్‌సీఈ కళాశాలలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

Published : 05 Feb 2023 05:43 IST

విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తున్న లక్ష్మీనారాయణ

మహబూబ్‌నగర్‌ గ్రామీణం : ప్రతి విద్యార్థి జీవితంలో మూడు లక్ష్యాలు ఎంచుకోవాలని మాజీ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ‘ఇంజినీరింగ్‌ విద్య ప్రాముఖ్యత’పై జేపీఎన్‌సీఈ కళాశాలలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. లక్ష్యం లేని చదువు వ్యర్థమని పేర్కొన్నారు. జన్మనిచ్చిన అమ్మానాన్న మనల్ని దగ్గరకు తీసుకొని భుజం తట్టి శభాష్‌ అనాలని, చదువుకున్న కళాశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లగలగాలని, జనం పోటీపడి మన సంతకం ఆటోగ్రాఫ్‌గా తీసుకోవాలని.. ఈ మూడు లక్ష్యాలతో విద్యార్థులు చదువుకుంటే ఉన్నత శిఖరాలకు తప్పక చేరుకుంటారన్నారు. విద్యార్థి దశలో కష్టపడే వారే భవిష్యత్తులో బాగుపడతారన్నారు. ఇంజినీరింగ్‌ విద్య ఎంతో విలువైనదని చెప్పారు. సమాజంలో అంత్యంత ఆవశ్యకతగా ఉండే కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపాలంటూ ఎలక్ట్రికల్‌, మెకానిక్‌, సివిల్‌ కోర్సుల ప్రాధాన్యతను లక్ష్మీనారాయణ వివరించారు.సీబీఐటీ కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ ఎల్‌.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్‌లో చేరే విద్యార్థులు ఆలోచించి అడుగులు వేయాలని సూచించారు. జేపీఎన్‌సీఈ కళాశాల ఛైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన సదస్సులో కళాశాల కార్యదర్శి వెంకటరామారావు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సుజీవన్‌కుమార్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, స్విట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రతినిధులు డాక్టర్‌ సుధాకర్‌, లక్ష్మీనారాయణ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉపాధ్యక్షుడు అంబటి పృథ్వీ, జిల్లాలోని వివిధ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో లక్ష్మీనారాయణ

మహబూబ్‌నగర్‌ గ్రామీణం : మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని మాజీ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వి.లక్ష్మీనారాయణ శనివారం దర్శించుకున్నారు. దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ఆలయ ఛైర్మన్‌ అలహరి మధుసూదన్‌కుమార్‌, ఇతర అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం హనుమద్దాసుల మండపంలో శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. జేపీఎన్‌సీఈ కళాశాల ఛైర్మన్‌ కేఎస్‌ రవికుమార్‌, కార్యదర్శి వెంకటరామారావు ఆయన వెంట ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని