logo

పెద్ద సార్లు తలచుకుంటే.. అంతా గప్‌చుప్‌!

జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Published : 28 Mar 2024 04:14 IST

గద్వాల, న్యూస్‌టుడే: జిల్లాలోని కస్తూర్బా పాఠశాలల్లో నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయని వస్తున్న ఫిర్యాదులపై విచారించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులే వాటిని తొక్కిపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో గట్టు గురుకుల పాఠశాలలో ఇదే పరిస్థితిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన తర్వాత గానీ ఉన్నతాధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించలేదు. తాజాగా ఓ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలకు వచ్చిన సరుకులను విద్యార్థినుల చేతనే పక్కకు తీయించి వారి చేతనే ప్యాకింగ్‌ చేయించి ప్రత్యేక సంచుల్లో ఉంచి వారితోనే మూటలను అర్ధరాత్రి ఆటోల్లోకి చేరవేయించిన వైనంపై విద్యార్థులే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నీరుగార్చే యత్నం: విద్యార్థినుల ఫిర్యాదుపై జిల్లా ఉన్నతాధికారి వచ్చి విచారించగా, విద్యార్థినులు జరిగిన తతంగాన్ని వివరంగా చెప్పినట్లు తెలిసింది. దీనిపై విచారించి నివేదిక స్థానిక డీఈవో ఇవ్వాల్సి ఉంది. అంతలోపే విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చి విచారణ అధికారికి విద్యార్థినులు గతంలో ఇచ్చిన లిఖిత పూర్వక వివరాలను మార్చి రాసి ఇచ్చేలా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. సమాజానికి పనికొచ్చే వారిగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఇలా చేయిస్తుండటంపై విద్యార్థినులు ఉన్నతాధికారి ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.  


విచారణ జరిపించాలి

గద్వాల పురపాలకం, న్యూస్‌టుడే: ధరూర్‌ కేజీబీవీలో గత నెలలో వంట సరకులు మాయం అయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బుధవారం గద్వాలలోని ఐడీవోసీలో కలెక్టర్‌ సంతోష్‌కు వినతిపత్రం అందజేసినట్లు విద్యాలయానికి చెందిన పలువురు సీఆర్టీలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై ఈనెల 19న జీసీడీవో ఫర్జానాబేగం ధరూర్‌ కేజీబీవీకి వచ్చి విచారించారని వారు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వారు కోరారు.


నివేదిస్తాం: ధరూరు కస్తూర్బాలో సరుకుల పక్కదారి అంశంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 19 తేదీన విచారించాం. విద్యార్థినులతో సహా ఉపాధ్యాయులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాం. సంబంధించి విచారణ నివేదికను స్థానిక డీఈవోకు ఇవ్వనున్నాం. నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు తీసుకునే చర్యలను అమలు చేస్తాం.

ఫర్జానా బేగం, జీసీడీవో, జోగులాంబ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని