logo

మొక్కలు మాడిపోతున్నాయ్‌

ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది.

Published : 29 Mar 2024 03:48 IST

సంరక్షణపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ

హౌజింగ్‌బోర్డు కాలనీ సమీపంలో ఎండుతున్న మొక్కలు

పాలమూరు పురపాలకం, న్యూస్‌టుడే: ఎండల తీవ్రతకు హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణపై అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఎండలకు తగ్గట్లు సరైన మోతాదులో రోజూ నీరు అందించకపోవడంతో ఆకులు కొమ్మలు చివరకి మాను వరకు దెబ్బతిని మోడుబారుతున్నాయి. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ప్రధాన రహదారి పొడవునా డివైడర్ల మధ్య ఉన్న  మొక్కలు, ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన సిమెంట్‌ తొట్లలో ఉంచిన మొక్కలకు సరిగా నీరందడంలేదు. జిల్లా కేంద్రంలో వన్‌టౌన్‌ కూడలి నుంచి భగీరథ కాలనీ, క్రిష్టియన్‌పల్లి, అమిస్తాపూర్‌ మీదుగా భూత్పూర్‌ పురపాలిక వరకు, వన్‌టౌన్‌ కూడలి నుంచి కొత్త బస్టాండ్‌, న్యూటౌన్‌, మెట్టుగడ్డ, ఏనుగొండ మీదుగా బైపాస్‌ వరకు, పిస్తాహౌజ్‌ కూడలి నుంచి అప్పన్నపల్లి మీదుగా జడ్చర్ల ప్లై ఓవర్‌ వరకు, పిస్తాహౌజ్‌ కూడలి నుంచి బైపాస్‌ పొడవునా మారుతి నెక్సా షోరూం కూడలి వరకు రహదారి పొడవునా డివైడర్లలో చెట్లు, మొక్కలు నాటారు. వీటికి రోజూ మూడు పూటలు ట్యాంకర్లతో నీరు పట్టాలని ముడా ఆధ్వర్యంలో ఇటీవల రూ.కోటికి పైగా నిధులు అప్రూవల్‌ చేశారు. వాస్తవానికి నీటి సరఫరా కోసం టెండరు వేయాల్సి ఉండగా ఎమ్మెల్సీ, లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో టెండరు వేయకుండా పాత గుత్తేదారులకే ఎజెండా ఆమోదం క్రింద కలెక్టర్‌ అనుమతితో పనులు అప్పగించారు. ఇద్దరు గుత్తేదారులు రోజూ ఒక్కపూట మాత్రమే ట్యాంకర్లతో  మొక్కలకు నీళ్లు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు.  

తొట్లలో మట్టే లేదు

పట్టణంలో ఫుట్‌పాత్‌పై సిమెంట్‌ తొట్లలో ఫెలిషియం జాతి మొక్కలు ఉంచారు. ట్యాంకర్లతో నీరు పట్టే సమయంలో పెద్ద పైపు ద్వారా వచ్చే నీటి ఉద్ధృతికి తొట్లలోని మట్టంతా క్రిందికి జారిపోతుంది. ఫలితంగా ఎక్కడ చూసినా సిమెంట్‌ తొట్లలో మట్టియే లేకుండా పోయింది. వేసవిలో నీరు సరిగా పట్టకపోవడంతో దాదాపుగా మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల తొట్లు పగిలిపోయి మొక్కలు క్రిందికి వాలినా పట్టించుకునే పరిస్థితి లేదు.

బైపాస్‌ వెంట ఈత చెట్లు..

బైపాస్‌ పొడవునా సుమారు 386 ఈత చెట్లు నాటారు. సరిగా నీరు అందని కారణంగా 80 వరకు పూర్తిగా ఎండిపోయాయి. చడీచప్పుడు కాకుండా ఎండిన ఈత చెట్లను తొలగించి వాటి స్థానంలో మళ్లీ కొత్తవి తెచ్చి నాటారు. ఇంత జరిగినా ఈ వేసవిలో మళ్లీ సరిగా నీరు పట్టకపోవడంతో చాలా వరకు ఈత చెట్లు ఎండుతున్నాయి. ఒక్కో ఈత చెట్టుకు సుమారు ఐదు బిందెల నీరు పట్టాలి. గుత్తేదారు సిబ్బంది మాత్రం ట్యాంకర్లతో అలా పోస్తూ ముందుకు వెళ్తుండటంతో వాటికి సరిగా నీరు అందడం లేదు. బైపాస్‌ పొడవునా ఈ వారం రోజుల్లోనూ మరో 35 ఈత చెట్లు ఎండి మోడుబారుతుండటం గమనార్హం.

పర్యవేక్షించని ఇంజినీర్లు: హరితహారం మొక్కలకు నీరు పెట్టే పనులను ముడా ఇంజినీర్లు పర్యవేక్షించడం లేదు. రూ.100.25 లక్షల భారీ వ్యయంతో నీటి సరఫరా పనులు అప్పగించిన ఇంజినీర్లు వాటి పనితీరు ఎలా ఉందో పర్యవేక్షణ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకసారి ఎండిన మొక్కకు ఎన్నిసార్లు నీటి పెట్టినా ప్రయోజనం ఉండదు. మొక్క ఎండకుండా ప్రతి రోజూ సకాలంలో నీటిని సరఫరా చేసే ప్రక్రియను ముడా అధికారులు అమల్లో ఉంచడం లేదు. మొక్కలకు నీరు సరఫరాపై ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని హరిత ప్రియులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని