logo

నెలన్నర రోజులుగా నిలిచిన విద్యుత్తు

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నెలన్నర రోజులుగా వ్యవసాయానికి విద్యుత్తు బంద్‌ అయింది. పొలాలకు నీరు పెట్టేందుకు మోటార్లు నడవటం లేదు. ఇది ఎక్కడో కాదు.. గజ్వేల్‌ మండలం అక్కారం శివారులో అన్నదాతలు ఎదుర్కొంటున్న దుస్థితి.

Published : 14 Aug 2022 01:46 IST

పునరుద్ధరణకు నోచుకోని స్తంభాలు.. తీగలు

అన్నదాతలకు అవస్థలు

న్యూస్‌టుడే, గజ్వేల్‌

అక్కారం శివారులో విద్యుత్తు తీగల తీరు..

ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా నెలన్నర రోజులుగా వ్యవసాయానికి విద్యుత్తు బంద్‌ అయింది. పొలాలకు నీరు పెట్టేందుకు మోటార్లు నడవటం లేదు. ఇది ఎక్కడో కాదు.. గజ్వేల్‌ మండలం అక్కారం శివారులో అన్నదాతలు ఎదుర్కొంటున్న దుస్థితి. ఆరు వారాల కిందట కురిసిన భారీ వర్షాలకు విద్యుత్తు స్తంభాలు కూలిపోయి... పలుచోట్ల తీగలు తెగాయి. దీంతో వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఈ తీరును పరిశీలించిన అధికారులు వారంలో పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇప్పటకీ సరఫరాకు చర్యలు తీసుకోలేదని రైతులు వాపోతున్నారు. అక్కారం- గణేశ్‌పల్లి మధ్య సుమారు 30 మంది రైతులకు దాదాపు 60 ఎకరాలు ఉన్నాయి. ప్రస్తుతం నాట్లు వేసే సీజన్‌ కావటంతో కరెంటు లేక పొలాలకు నీరు పెట్టే పరిస్థితి లేదు. అదును దాటిపోతుండటంతో చేసేదేమిలేక వర్షం కురిసిన రోజు నాట్లు వేసుకుంటున్నారు. సాగునీరు లేక దున్నిపెట్టిన పొలాలు తడారిపోతున్నాయి. తెగిన తీగలు ఇప్పటికీ పొలాల్లో వేలాడుతూనే ఉండటం గమనార్హం. స్తంభాలు పాతేందుకు తాము స్వయంగా గుంతలు తీశామని, ఎన్ని సార్లు అధికారులను అడిగినా ఇదిగో.. అదిగో అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై గజ్వేల్‌ డివిజన్‌ డీఈ శ్రీనివాసచారిని వివరణ కోరగా.. తీగలు తెగిపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని త్వరలోనే విద్యుత్తు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని