logo

గిరిజన గురుకులం.. ఉజ్వల భవితవ్యం

గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Published : 29 Jan 2023 03:10 IST

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

గిరిజనులను విద్యావంతులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటుచేసింది. సంగారెడ్డికి సదరు విద్యాలయాన్ని కేటాయించగా స్థానికంగా వసతి లేకపోవడంతో పటాన్‌చెరు మండలం పెద్దకంజర్లలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో కొనసాగిస్తున్నారు. చదువు, వసతి ఒకే చోట ఉండటంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఇటీవల ఇందులో ప్రవేశాలకు టీజీయూసెట్‌ ప్రకటన విడుదల చేసింది.

ఐదు కోర్సులు..

2017-18 సంవత్సరంలో సంగారెడ్డి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల మంజూరైంది. ఇక్కడ ఐదు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఎస్సీలో లైఫ్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, బీకాం హానర్‌, బీకాం కంప్యూటర్‌, బీఏ సీబీసీఎస్‌ కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్కో దాంట్లో 40 చొప్పున సీట్లు ఉండగా బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌లో అత్యధికంగా 120 సీట్లు ఉన్నాయి. మొత్తం 280 వరకు ఉన్నాయి. 2023-24 సంవత్సరానికి ఆయా వాటి భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఇంటర్‌ ఉత్తీర్ణులైన, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారు అర్హులు.

ప్రాజెక్టులు సైతం..

గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో చేరే విద్యార్థుల్లో నైపుణ్యంతో పెంచేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. మిర్రర్‌ ప్రాజెక్టు, ఫ్లిప్‌డ్‌ క్లాస్‌, ఎనర్జీగర్స్‌, సెమినార్‌ క్లాసెస్‌, క్లబ్‌ యాక్టివిటీస్‌, సుపూర్‌ నోవా, భారత్‌ దర్శన్‌ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ఆయా వాటిల్లో ప్రతిభ చాటిన వారిని ప్రభుత్వపరంగా ప్రోత్సహిస్తున్నారు. భారత్‌ దర్శన్‌ ప్రాజెక్టు ద్వారా ఇప్పటికే పలువురు శ్రీలంక సందర్శించి వచ్చారు.

దరఖాస్తు ఇలా..

ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గిరిజనులతో పాటు కొన్ని సీట్లు,  ఎస్సీ, బీసీలకు సైతం కేటాయించారు. గిరిజన విద్యార్థులకు 85 శాతం, మిగతా వారికి 15      శాతం సీట్లు రిజర్వు చేశారు. http:///tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాల్సి ఉంటుంది. తుది గడువు ఫిబ్రవరి 5. మార్చి 5న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

నాణ్యమైన బోధన: శ్రీలత, ప్రిన్సిపల్‌

గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా అడుగేస్తున్నాం. వివిధ ప్రాజెక్టుల ద్వారా అన్ని అంశాల్లోనూ ముందుండేలా చూస్తున్నాం.

సదుపాయాలు ఇలా..

కళాశాలలో చేరిన వారందరికీ ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారు. గురుకులంలో పూర్తిస్థాయి ప్రమాణాలతో కూడిన కంప్యూటర్‌, సైన్స్‌ ప్రయోగశాల అందుబాటులో ఉన్నాయి. ఉన్నతస్థాయి విలువలు అందించే పుస్తకాలతో కూడిన గ్రంథాలయాన్ని నెలకొల్పారు. అన్ని కోర్సులకూ సాంకేతిక విద్య అందిస్తున్నారు. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకుతో బోధన సాగుతోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ప్రణాళికతో సాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని