logo

నిర్లక్ష్యం.. అభివృద్ధికి ఆటంకం

నిధుల లేమి.. కొరవడిన పర్యవేక్షణ.. సిద్ధం చేయని ప్రతిపాదనలు.. ఇవన్నీ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఏళ్ల కిందట మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పూర్తిపై దృష్టిసారించడం లేదు.

Published : 06 Feb 2023 01:47 IST

జిల్లా కేంద్రంలో ఏళ్లుగా ఇదే తంతు
న్యూస్‌టుడే, మెదక్‌

నిధుల లేమి.. కొరవడిన పర్యవేక్షణ.. సిద్ధం చేయని ప్రతిపాదనలు.. ఇవన్నీ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఏళ్ల కిందట మంజూరైన నిధులతో చేపట్టిన పనుల పూర్తిపై దృష్టిసారించడం లేదు. కీలకమైన వలయ రహదారి విషయంలో అమాత్య ఇచ్చిన హామీ నెరవేరలేదు. జిల్లా కేంద్రం మెదక్‌లో నెలకొన్న పరిస్థితి ఇది. ఆయా సమస్యల తీరుపై ‘న్యూస్‌టుడే’ కథనం.

నిజాం కాలంలో సుభాగా కొనసాగిన మెదక్‌ పట్టణం.. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 21 మండలాలతో కొనసాగుతోంది. ప్రధాన రహదారి విస్తరణ చేపట్టడంతో కాస్త అభివృద్ధి కనిపిస్తోంది. అంతర్గత దారుల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. జలజాలం పనులను సాకుగా చూపారు. ఎట్టకేలకు పనులు పూర్తయినా ఇంకా సీసీ రోడ్ల నిర్మాణాలు పూర్తికాలేదు.


‘వలయ’ దిగ్బంధం

వాహనాల రద్దీ

2014 డిసెంబరులో స్థానిక పీఎన్‌ఆర్‌ ఇండోర్‌ మైదానంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ ట్రాఫిక్‌ పెరుగుతున్న నేపథ్యంలో మెదక్‌కు బాహ్యవలయ రహదారిని ప్రకటించారు. ఎనిమిదేళ్లయినా ఒక్క అడుగు ముందుకు పడలేదు. మెదక్‌ మండలం మంబోజిపల్లి వరకు 765 (డి) జాతీయ రహదారి నిర్మాణం పూర్తయింది. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే భారీ వాహనాలు మెదక్‌ మీదుగా మహారాష్ట్ర, హైదరాబాద్‌కు వెళ్తుండటంతో రద్దీ ఉంటోంది. వేడుకలు నిర్వహణ, ఆందోళనలు చేపట్టినా వాహనాలు నిలిచిపోతున్నాయి. బాహ్యవలయ రహదారికి సర్వే చేసి హద్దులు గుర్తించి వదిలేశారు.


అటకెక్కిన ఆహ్లాదం

గోసంద్రం చెరువు వద్ద..

స్థానిక పిట్లం, గోసంద్రం చెరువులను కలిపి మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు రూ.9 కోట్లు విడుదలయ్యాయి. 2014లో పనులు మొదలవగా కట్ట విస్తరణతో పాటు పటిష్టం, ఫుట్‌పాత్‌ వంటి పనులు చేపట్టారు. మురుగు కలవకుండా పిట్లం చెరువులో పైపులు బిగించారు. పచ్చదనం ఏర్పాటు, విద్యుత్తు దీపాలు, టైల్స్‌ వేయాల్సి ఉంది. ఆయా వనరుల కట్ట కయ్యలు పడి మట్టి కొట్టుకుపోతోంది. రెండింటిని అనుసంధానం చేసి హవేలిఘనపూర్‌ మండలం ముత్తాయికోట మార్గంలోని సంజీవయ్య కాలనీ వద్ద చౌరస్తా అభివృద్ధి చేస్తామన్న ప్రకటన కార్యరూపం దాల్చలేదు. 70 వేలకు పైగా జనాభా ఉండగా ఒక్క ఉద్యానం లేదు.


అసంపూర్తిగా విస్తరణ

గంగినేని థియేటర్‌ సమీపంలో రహదారి ఇలా..

జిల్లా కేంద్రంలో నర్సాపూర్‌ మార్గంలోని ఎల్లమ్మ ఆలయం నుంచి గంగినేని థియేటర్‌ వరకు ప్రధాన రహదారి విస్తరణ చేపట్టారు. కేవలం విభాగిని, ఫుట్‌ఫాత్‌ నిర్మించారు. జలజాలం పనులు చేపట్టాల్సి ఉండటంతో విస్తరించిన రహదారిపై తారు వేయలేదు. మరోవైపు నర్సాపూర్‌ చౌరస్తా వద్ద కూడలి నిర్మించాల్సి ఉంది. ఈ చౌరస్తా నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఇరువైపులా ఫుట్‌పాత్‌ నిర్మించగా, పలు చోట్ల ధ్వంసమైంది. ఎల్లమ్మ ఆలయం నుంచి గంగినేని థియేటర్‌ వరకు తారు రహదారి పనులకు ర.భ. అధికారులు టెండర్లు ఆహ్వానించారు.


త్వరలో పనులు చేపడతాం
- చంద్రపాల్‌, పురపాలిక అధ్యక్షుడు, మెదక్‌

మినీ ట్యాంక్‌బండ్‌ అభివృద్దిలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు నిధులు రావాల్సి ఉంది. పట్టణానికి వలయ రహదారి కాకుండా, కేవలం బైపాస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. త్వరలో సీఎం కేసీఆర్‌ పర్యటన ఉన్నందున, ఆ రోజు నిధులు ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. మిగతా పనులు త్వరలో చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని