logo

ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘లీ ఫార్మా పరిశ్రమ’లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగి భయానక వాతావరణం నెలకొంది.

Updated : 09 Feb 2023 05:55 IST

గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఘటన

పరిశ్రమలో ఎగసిపడుతున్న మంటలు

జిన్నారం, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘లీ ఫార్మా పరిశ్రమ’లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగి భయానక వాతావరణం నెలకొంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పరిశ్రమ ఆవరణలోని సాల్వెంట్‌ నిల్వ కేంద్రం టోలిన్‌ రసాయనం నుంచి మంటలు రేగాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు నాలుగు పర్యాయాలు మంటలు ఎగిసిపడ్డాయి. సాల్వెంట్లు పూర్తిగా కాలిపోయేదాకా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పరిశ్రమ వర్గాలు సంయుక్తంగా సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చాయి. కర్మాగారాల భద్రతా శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్సెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచనతో సమీపంలోని మైలాన్‌, హెటిరో, ఎస్‌ఎంఎస్‌, దివిస్‌ తదితర పరిశ్రమల భద్రతా సిబ్బంది మంటలార్పడంలో సహకరించారు. రసాయనాల ట్యాంకులు, డ్రమ్ములు నిల్వ చేసే యార్డులో రాపిడి, లీకేజీ వల్ల మంటలు అంటుకుని ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని లీఫార్మా ప్రతినిధి మోహన్‌రావు తెలిపారు. స్వల్పంగా గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.

బయటకు పరుగులు తీస్తున్న మహిళా కెమిస్ట్‌లు


తుక్కు దుకాణంలో రూ.లక్ష ఆస్తి ఆహుతి

దుబ్బాక, న్యూస్‌టుడే: పురపాలికలోని లచ్చపేట 11వ వార్డులో ఉన్న శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాల ఖాళీ భవనంలో ఎండీ తాజొద్దీన్‌ అనే వ్యక్తి నిర్వహిస్తున్న తుక్కు దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న దుబ్బాక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రం సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో దాదాపు రూ.లక్ష విలువైన పాత సామాను కాలిపోయిందని బాధితుడు బోరుమన్నాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గతంలో ఖాళీగా ఉన్న ఈ పాఠశాల భవనాన్ని పురపాలక శాఖ అధీనంలోకి తీసుకొని గ్రామ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొంతకాలం పాటు పొడి చెత్త సేకరణ కేంద్రాన్ని నిర్వహించింది. ఆ తరవాత తాజొద్దీన్‌ అక్కడే తుక్కు దుకాణం నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని