logo

నిరంతర అభివృద్ధికి మరోసారి భారాసను ఆశీర్వదించండి

విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో ఇబ్బందులు తీరాయని, ఒకప్పుడు కరెంట్‌ ఉంటే వార్త అని, నేడు పోతే వార్త అవుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 06 Jun 2023 00:58 IST

మంత్రి హరీశ్‌రావు

ఏడుపాయల్లో వనదుర్గా హోమం నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, పాలనాధికారి రాజర్షి షా, అదనపు కలెక్టరు ప్రతిమాసింగ్‌, తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతో ఇబ్బందులు తీరాయని, ఒకప్పుడు కరెంట్‌ ఉంటే వార్త అని, నేడు పోతే వార్త అవుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్‌లోని ఓ గార్డెన్స్‌లో జరిగిన విద్యుత్తు ప్రగతి సభలో మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అద్భుత పని తీరుతో సమస్యలు తీరాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో ఏదో ఓ రూపంలో లాభం పొందని ఇల్లు ఏ ఒక్కటి లేదన్నారు. నిరంతర అభివృద్ధికి భారాసను మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో రాష్ట్రం పురోగతి సాధించిందన్నారు. పాలనాధికారి రాజర్షిషా మాట్లాడారు. పలువురు సిబ్బందికి మంత్రి జ్ఞాపికలు అందజేశారు. డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, పురపాలిక అధ్యక్షుడు చంద్రపాల్‌, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్‌గౌడ్‌, ఎంపీపీలు శేరి నారాయణరెడ్డి, సిద్దిరాములు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ జానకిరాం, డీఈఈ కృష్ణమూర్తి తదితరులున్నారు.

యాగశాల ప్రారంభం

పాపన్నపేట, న్యూస్‌టుడే: గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌ హయాంలో నీళ్లు, కరెంటు కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మెదక్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, పాలనాధికారి రాజర్షిషాలతో కలిసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో వనదుర్గమ్మను దర్శించుకున్నారు. యాగశాలను ప్రారంభించి గణపతి, వనదుర్గ హోమాల్లో పాల్గొన్నారు. హరిత హోటల్‌లో కొల్చారం మండలానికి చెందిన పలువురికి ఇళ్ల స్థలాల పట్టాలు అందజేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రాంతీర్థంలో 56 రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఆరు నెలల్లో 24 గంటల కరెంటు ఇస్తా అంటే కాంగ్రెస్‌ నాయకుడు జానారెడ్డి అదెలా సాధ్యమని అన్నట్లు గుర్తుచేశారు. కేంద్రం చెప్పినట్లుగా వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు పెట్టనందుకు రాష్ట్రానికి రావాల్సిన రూ.30 వేల కోట్లు ఆపిందన్నారు. ఈ నెల 14నుంచి గర్భిణులకు పోషక కిట్ల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో సాయిరాం, డీఎస్పీ సైదులు, ఈవో శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జగన్‌ తదితరులున్నారు.

అవార్డులు వస్తున్నా విమర్శిస్తున్నారు..

మెదక్‌ టౌన్‌: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుండటంతో ఓర్వలేక కేంద్రం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మెదక్‌లో డీసీసీబీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దిల్లీలో రాష్ట్రానికి అవార్డులు ఇచ్చి గల్లీలో విమర్శిస్తున్నారన్నారు. నీతి ఆయోగ్‌ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఐటీ ఉద్యోగాలతో పాటు అటవీ విస్తీర్ణం పెంచడంలో తొలిస్థానంలో నిలిచిందన్నారు.

* మెదక్‌లోని ఎంపీపీ కార్యాలయ ప్రాంగణంలో జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 280 సంఘాలకు సంబంధించిన రూ.23.51 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి తీరును ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. సంఘం కార్యాలయ భవనానికి 500 గజాల స్థలం కేటాయిస్తూ పత్రాన్ని అందజేశారు. నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు. మెదక్‌ పట్టణంలో ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌, మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్‌తో కలిసి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని