logo

మార్గం సుగమం.. సాఫీగా ప్రయాణం

ప్రజలు రాకపోకలు సులువుగా సాగించడంలో రహదారులదే కీలకపాత్ర. వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది.

Published : 07 Jun 2023 01:34 IST

నాందేడ్‌ అకోలా జాతీయ రహదారి

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: ప్రజలు రాకపోకలు సులువుగా సాగించడంలో రహదారులదే కీలకపాత్ర. వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలను, తెలంగాణ, మహారాష్ట్రను కలుపుతూ నాందేడ్‌- అకోలా జాతీయ రహదారి 161 విస్తరణ పనులు చేపట్టారు. 2018-19లో భారత్‌మాల ప్రాజెక్టులో విస్తరణకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇవి తుది దశకు చేరుకున్నాయి.

మూడు ప్యాకేజీలుగా...: జిల్లాలో మూడు ప్యాకేజీలుగా నాందేడ్‌- అకోలా జాతీయ రహదారి  నాలుగు వరుసలుగా విస్తరించారు. అవసరం ఉన్న చోట వంతెనలు నిర్మించారు. మొదటి ప్యాకేజీలో కంది మండలం మామిడిపల్లి నుంచి అందోలు మండలం రాంసాన్‌పల్లి వరకు 46 కిలోమీటర్ల పనులకు రూ.1000 కోట్లు కేటాయించారు. రెండో దశలో అందోలు మండలం రాంసాన్‌పల్లి నుంచి మంగ్లూర్‌ వరకు 48 కిలోమీటర్ల విస్తరణకు రూ.1,234 కోట్లు మంజూరయ్యాయి. మూడో దశలో మంగ్లూర్‌ నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 48 కిలోమీటర్ల పనులను రూ.936 కోట్లతో పూర్తిచేశారు. దాదాపు అంతటా పనులు పూర్తయ్యాయి. కేవలం చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్‌టీయూ వద్ద కొనసాగుతున్నాయి. ఈ మూడు మార్గాల్లో అన్నిరకాల భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అవసరం ఉన్న చోట బైపాస్‌, వంతెన నిర్మించారు.

తగ్గిన ప్రయాణం భారం: గతంలో సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్‌కు వెళ్లాలంటే నాలుగు గంటలు సమయం పట్టేది. ప్రస్తుతం విస్తరణ పనులు పూర్తి కావడం వల్ల గంటన్నరలో వెళుతున్నారు. నాలుగు వరుసలుగా ఉండటం వల్ల ప్రయాణం సాఫీగా సాగుతోంది. నిర్దేశించిన కాల పరిమితిలో పనులు చేయించేలా చర్యలు తీసుకున్నామని జాతీయ రహదారిసంస్థ పీడీమధుసూదన్‌రావు తెలిపారు. కంది మండలం మామిడిపల్లిలో స్థలం విషయంలో ఆలస్యమైందని, ప్రస్తుతం పనులు వేగంగా సాగుతున్నాయని త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని