logo

మాజీ కలెక్టర్‌కు వేల కోట్లు ఎక్కడివి?

భారాస మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు.డిమాండ్‌ చేశారు.

Published : 28 Mar 2024 01:28 IST

భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై రఘునందన్‌రావు విమర్శలు

మాట్లాడుతున్న భాజపా మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు

సంగారెడ్డి అర్బన్‌:  భారాస మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి, మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని భాజపా మెదక్‌ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు.డిమాండ్‌ చేశారు. సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వెంకట్రామిరెడ్డి మెదక్‌ ఎంపీ టికెట్‌ను రూ.100 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. మెదక్‌ జిల్లాలో పోటీకి నాయకులు లేరా, కరీంనగర్‌ జిల్లా వాసికి ఇక్కడ పెత్తనం అవసరమా? అంటూ భారాసను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తనను కలెక్షన్‌ కింగ్‌ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే సంగారెడ్డి అంబేడ్కర్‌ చౌరస్తాలో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావును పరుష పదజాలంతో విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబ పాలనతో రూ.వేలాది కోట్ల ఆస్తులు సంపాందించుకున్నారని దుయ్యబట్టారు. పటాన్‌చెరులో హరీశ్‌రావు అక్రమ మైనింగ్‌ నిర్వహించారని, త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఆత్మరక్షణకు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కారు షెడ్డుకు చేరిందన్నారు. ఎమ్మెల్సీ కవిత తిహాడ్‌ జైలులోనూ బంగారు నగలు పెట్టుకునేందుకు కోర్టు అనుమతి కోరడం విడ్డూరమన్నారు. భాజపా జిల్లా అధ్యక్షురాలు గోదావరి, ఇన్‌ఛార్జి పులిమామిడి రాజు పాల్గొన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని