logo

దాత ఔదార్యం.. భక్తులకు సౌకర్యం

వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు.

Published : 28 Mar 2024 01:34 IST

పందిల్లలో గుడి ముందు నిర్మిస్తున్న వంతెన

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: వారి కులదైవమంటే ఆ దంపతులకు చాలా నమ్మకం. సొంత ఖర్చుతో దైవానికి ఆలయం నిర్మించారు. సరైన దారి లేక దర్శనానికి ఇబ్బంది పడుతున్న విషయం గమనించి తాజాగా వంతెన నిర్మిస్తున్నారు. భక్తిభావాన్ని చాటుకొని భక్తులకు సౌకర్యం కల్పించనున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం పందిల్లకు చెందిన సొల్లు గాలయ్య, బుచ్చమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. గాలయ్య 30 ఏళ్ల క్రితం ఉపాధికోసం ముంబయి వెళ్లగా భార్యాపిల్లలు ఇక్కడే ఉన్నారు. వారికి గ్రామంలో సొంత ఇల్లుతో పాటు వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తున్నారు. ముంబయిలో మొదట గాలయ్య కూలీ పనులు చేసేవారు. అలా చేస్తూ ఎదిగి గుత్తేదారు అయ్యారు. తరచూ స్వగ్రామానికి వచ్చినపుడు తమ కులదైవమైన మాలపోచమ్మ (శీతలాదేవి) గుడి శిథిలావస్థను గమనించారు. చలించిపోయారు. 12 ఏళ్ల క్రితం రూ.5 లక్షల ఖర్చుతో గ్రామంలోని కుమ్మరికుంట కట్టపై గుడి నిర్మించారు. పురాతన గుడిలోని అమ్మవారిని కొత్త ఆలయంలో ప్రతిష్ఠింపచేశారు. ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. బోనాలు సమర్పిస్తున్నారు. ప్రధాన రహదారికి ఈ గుడి మధ్య కుంట మత్తడితో పాటు ఒర్రె ఉంది. వర్షాకాలంలో అమ్మవారి దర్శనం కోసం గుడి వద్దకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వాటిని గమనించిన ఆయన ఒర్రెపై వంతెన నిర్మించాలని అనుకున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.3 లక్షల అంచనా వ్యయంతో దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. బుధవారం వంతెనకు స్లాబ్‌ పడింది. పనులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనున్నట్లు గాలయ్య తెలిపారు. ఈ గుడి నిర్మాణమే కాదు గ్రామాభివృద్ధికి సంబంధించి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు ఎల్‌ఈడీ టీవీని బహూకరించారు. ఆయన భక్తి భావానికి, దాతృత్వానికి గ్రామస్థులు అభినందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు