logo

ఆ తల్లిదండ్రుల కలలు.. కల్లలు

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అయినా వెనుకడుగు వేయకుండా ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేస్తూ.. కుమారుడిని చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు.

Published : 17 Apr 2024 02:51 IST

ట్రిపుల్‌ ఐటీలో చదువుతున్న కుమారుడి మరణంతో తీరని వేదన

తొగుట, సిద్దిపేట, న్యూస్‌టుడే: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. అయినా వెనుకడుగు వేయకుండా ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేస్తూ.. కుమారుడిని చదువులో వెన్నుతట్టి ప్రోత్సహించారు. చురుగ్గా ఉండే ఆ పుత్రుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రయోజకుడిగా ఎదిగి కుటుంబాన్ని ప్రగతిలోకి తీసుకువస్తాడని కోటి కలలుగన్నారు. అనుకోని పరిణామంతో కుమారుడు బలవన్మరణానికి పాల్పడటంతో వారి కలలు కల్లలై విషాదంలో ఉన్నారు. అనారోగ్యం రూపంలో వచ్చిన మృత్యువు.. అమ్మానాన్నలు అనుకున్న లక్ష్యాన్ని చేరలేమోననే బాధ.. ఓ క్షణికమైన నిర్ణయంతో బాలుడు సోమవారం ప్రాణాలు తీసుకున్నాడు. బాసర ట్రిపుల్‌ ఐటీలో పీయూసీ ద్వితీయ సంవత్సరం చదివే తొగుట మండలం బండారుపల్లికి చెందిన విద్యార్థి (17) బలవన్మరణం చెందిన తీరు తల్లిదండ్రులకు క్షోభను మిగిల్చింది. తల్లి బీడీలు చుడుతుండగా.. తండ్రి హమాలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మానాన్నల కష్టాన్ని గుర్తించిన బాలుడు మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. తొగుట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి.. మెరుగైన జీపీఏతో బాసర ట్రిపుల్‌ ఐటీకి ఎంపికయ్యాడు. గత విద్యా సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధించాడు. ద్వితీయ సంవత్సరంలో ఎలర్జీ, టైఫాయిడ్‌ సమస్యలతో కొన్నాళ్లుగా బాధపడుతూ తరగతులకు దూరమయ్యాడు. హాజరు శాతం తగ్గి పరీక్షలకు నిర్వాహకులు అనుమతి ఇవ్వకపోవడంతో చదువును కొనసాగించలేనేమోనన్న అపోహతో బాల్యంలోనే జీవితాన్ని బలవంతంగా ముగించాడు. మరోవైపు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని