logo

సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు.

Published : 17 Apr 2024 03:27 IST

కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

కలెక్టరేట్‌లో ఏర్పాట్లపై సూచనలు చేస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25 వరకు స్వీకరిస్తామన్నారు. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. నామపత్రాల స్వీకరణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం:   ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రిటర్నింగ్‌ అధికారికి నేరుగా కాకుండా సువిధ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ పత్రాలపై అభ్యర్థి సంతకం చేసి రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్‌కు ముందే అభ్యర్థి తన పేరున ఎన్నికల ఖర్చు కోసం కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించి వివరాలను ఆర్‌వో కార్యాలయంలో అందజేయాలన్నారు. రిజర్వుడ్‌ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని పేర్కొన్నారు. జనరల్‌ అభ్యర్థులు రూ.25 వేలు, ఎస్సీ అభ్యర్థులు రూ.12,500లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలన్నారు.

 ఐదుగురికి మాత్రమే అనుమతి: నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని తెలిపారు. నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్‌ అధికారి వద్దకు అభ్యర్థితో పాటు నలుగురికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. నామినేషన్‌ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్‌ కేసులు, విద్యా అర్హత పత్రాలను దాఖలు చేయాలన్నారు.
పటిష్ఠ బందోబస్తు: ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లాలో వీడియో నిఘా బృందాలు, అకౌంటింగ్‌, ఖర్చుల పర్యవేక్షణ బృందాలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయని తెలిపారు. ప్రలోభపరిచే వస్తువులు సరఫరా కాకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


ఎన్నికల నిర్వహణకు సహకరించాలి

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ నామినేషన్‌ దాఖలుకు ముందు అభ్యర్థులు తమ నామినేషన్లను హెల్ప్‌డెస్క్‌లో సరిచూసుకోవాలన్నారు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్లను దాఖలు చేసే అవకాశం ఉందని, ఫారం ద్వారా సమర్పించే అఫిడవిట్‌లో అన్ని ఖాళీలు పూరించాలన్నారు. క్రిమినల్‌ కేసులుంటే వాటి వివరాలను మూడుసార్లు పత్రికల్లో ప్రచురణ చేయాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లో నామినేషన్‌ దాఖలు ఏర్పాట్లను పరిశీలించారు. బారికేడ్లు, మీడియా పాయింట్‌ తదితర ఏర్పాట్లపై సూచనలు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని