logo

పరస్పర సహకారం..ఆర్థికవృద్ధికి దోహదం

సభ్యులకు బీమా సేవల పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా

Updated : 18 Apr 2024 02:40 IST

పురుషుల పొదుపు సంఘాలతో..

 

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం: సభ్యులకు బీమా సేవల మహిళా పొదుపు సంఘాలే కాదు.. వాటికి ధీటుగా పురుషుల పొదుపు సంఘాలు ఉన్నాయి. పురుషుల్లో పొదుపు చేసే అలవాటును పెంచే ఉద్దేశంతో వీటిని ఏర్పాటుచేశారు. ఆర్థిక అవసరాలకు రుణాలు ఇస్తూ ఆదుకుంటుండటం విశేషం. పరస్పర సహకారం అందిస్తూ సభ్యుల స్వయం సమృద్ధి, స్వావలంబనకు కృషి చేస్తున్నాయి. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో ఈ తరహా పొదుపు సంఘాలు కొనసాగుతున్నాయి.

సహ వికాస ఆధ్వర్యంలో..

హన్మకొండ కేంద్రంగా నెలకొల్పిన సహ వికాస సంస్థ స్వకృషి పొదుపు ఉద్యమాన్ని ప్రారంభించింది. 1992లో పురుషుల పొదుపు సంఘాలను ప్రారంభించారు. 2000లో హుస్నాబాద్‌ మండలం మీర్జాపూర్‌, అక్కన్నపేట మండలం మల్లంపల్లిలో తొలిసారిగా వీటిని నెలకొల్పారు. విజయవంతంగా కొనసాగడంతో కోహెడ, నంగునూరు, సిద్దిపేట మండలాల్లో ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 37 సంఘాల్లో 13,131 మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో సంఘానికి ఒక పాలకవర్గం, గణకుడు ఉంటారు. సభ్యులే పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు.

మూడు రకాలుగా..

ఇప్పటివరకు సభ్యుల పొదుపు మొత్తం రూ.24.13 కోట్లకు చేరింది. సంఘాల ఏర్పాటు సమయంలో నెలకు ఒకరు రూ.50 చొప్పున పొదుపు చేశారు. ఇటీవలి కాలంలో ఏర్పాటైన వాటిల్లో నెలకు .100 చొప్పున చేస్తున్నారు. జమైన మొత్తం నుంచి రుణాలు ఇస్తున్నారు. సాధారణం కింద గరిష్ఠంగా రూ.50 వేలు, పొదుపు, బోనస్‌కు మూడు రెట్లుప్రత్యేక విభాగం కింద రుణంగా ఇస్తున్నారు. బోనస్‌ విభాగంలో మూడు రెట్ల బోనస్‌ను రుణంగా ఇస్తారు. 24 నెలల్లో నిర్దేశించిన వడ్డీతో కలిపి కచ్చితంగా చెల్లించాల్సిందే. లేదంటే అపరాధ రుసుం వసూలు చేస్తారు.

సభ్యులకు బీమా సేవలు 

సభ్యులకు రెండు రకాల బీమా సదుపాయాలు కల్పించారు. అభయ నిధి పథకంలో సభ్యుల వయసును బట్టి రూ.550 నుంచి రూ.1050 వరకు ప్రీమియం చెల్లించాలి. ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. 3085 మంది ఇందులో చేరారు. గత ఆర్థిక సంవత్సరంలో 12 మంది మృతి చెందగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున చెల్లించారు. మరోటి సామూహిక నిధి పథకం. ఇందులో 4298 మంది సభ్యులు చేరారు. ఒక్కో సభ్యుడు ఏడాదికి రూ.200 చొప్పున ప్రీమియం చెల్లించాలి. ఏ కారణంతోనైనా మృతి చెందితే రూ.30వేల వరకు చెల్లిస్తారు. అంత్యక్రియలకు సాయం చేస్తారు.


అంతా పారదర్శకం
- తిరుపతి, సమితి అధ్యక్షుడు

సంఘాల పనితీరు పారదర్శకంగా జరుగుతోంది. ప్రతీ లావాదేవీకి రసీదు ఇస్తారు. రికార్డులు పక్కాగా నిర్వహిస్తారు. ఏడాదికోసారి ఆడిట్‌ చేపట్టి సర్వసభ్య సమావేశంలో వెల్లడిస్తారు. ఆరు సంఘాల్లో కంప్యూటర్‌ లావాదేవీలు సాగుతున్నాయి. 8 సంఘాలకు సొంత భవనాలు ఉన్నాయి.


తాకట్టు లేకుండానే..
- పిల్లి ప్రభాకర్‌గౌడ్‌, కోహెడ

సభ్యుల ఆర్థిక అవసరాలకు ఎలాంటి తాకట్టు లేకుండానే అప్పు దొరుకుతోంది. ఇప్పటివరకు 10 సార్లు అప్పు తీసుకున్నా. క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తేనే మళ్లీ ఇస్తారు. పొదుపు రూ.13 వేలు ఉండగా, రూ.13 వేల బోనస్‌ కూడా వచ్చింది. ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతోంది.


కుమార్తె వివాహానికి..
- రాగుల ఉప్పలయ్య, నంగునూరు

పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నా. సంఘంలో 18 ఏళ్ల క్రితం చేరా. రూ.17 వేలు పొదుపు చేశా. నెల క్రితం కుమార్తె వివాహానికి రూ.70 వేలు అప్పు తీసుకున్నా. వడ్డీ చాలా తక్కువ. నాలాంటి వారికి అండగా నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని