logo

అందం.. ఆహ్లాదం

ప్రధాన నగరాలలో మాత్రమే దర్శనమిచ్చే ఆకర్షణీయమైన బోర్డులు మిర్యాలగూడ వంటి మధ్య స్థాయి పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నారు పుర అధికారులు. సుమారు రూ.28లక్షలతో ఏర్పాటు చేసిన పట్టణంలోని రామచంద్రగూడెం వై కూడలిలో

Published : 21 Jan 2022 02:56 IST

● నామ ఫలకలతో మిర్యాలగూడకు కొత్త సొబగులు


మిర్యాలగూడ బోటింగ్‌ పార్కులో ఏర్పాటు చేసిన ‘లవ్‌ ఎమ్మెల్జీ’ బోర్డు

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ప్రధాన నగరాలలో మాత్రమే దర్శనమిచ్చే ఆకర్షణీయమైన బోర్డులు మిర్యాలగూడ వంటి మధ్య స్థాయి పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నారు పుర అధికారులు. సుమారు రూ.28లక్షలతో ఏర్పాటు చేసిన పట్టణంలోని రామచంద్రగూడెం వై కూడలిలో ‘వెల్‌కమ్‌ ఎమ్మెల్జి’ బోర్డు, బోటింగ్‌ పార్కులో ‘లవ్‌ ఎమ్మెల్జి’ బోర్డు, సుందరయ్య పార్కులో ఏర్పాటు చేసిన ‘పురపాలక సంఘం, మిర్యాలగూడ’ బోర్డుతో పాటు ఈదులగూడ బైపాస్‌ కూడలిలో ‘మన మిర్యాలగూడ’ బోర్డులు ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో ప్రజలు ఆహ్లాదంగా గడుపుతున్నారు.

స్వీయ చిత్రాలజోరు..

పట్టణంలోని తాళ్లగడ్డ బోటింగ్‌ పార్కులో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన ‘లవ్‌ ఎమ్మెల్జి’ బోర్డు పట్టణ, పరిసర ప్రాంత ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. చెంతనే శివాలయం, బోటింగ్‌ యూనిట్‌ ఉండటంతో అక్కడికి వచ్చే వారంతా ఈ బోర్డు పక్కన నిలబడి స్వీయ చిత్రాలు దిగుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారు. సెలవు దినాల్లో అక్కడ స్వీయ చిత్రం దిగాలంటే కొద్ది సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు పట్టణంలోని సుందరయ్య పార్కులో రూ.8లక్షలతో ఏర్పాటు ‘పురపాలక సంఘం, మిర్యాలగూడ’ బోర్డు సైతం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి ప్రత్యేకంగా విద్యుద్దీపాలు అమర్చడంతో రాత్రి వేళల్లో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దాని కిందనే నాగార్జున సాగర్‌ నమూనా ఆనకట్ట ఉండటంతో చిన్నారులు, యువత స్వీయ చిత్రాలు దిగుతూ ఆనందంగా గడుపుతున్నారు.

ఆయా బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పచ్చని గడ్డి, ఇతర మొక్కలతో సుందరీకరణ చేపట్టడంతో మరింత సౌందర్యం చేకూరింది. ఈ బోర్డులతో పట్టణానికి మరింత అందం చేకూరిందని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటి వద్ద ఏర్పాటు చేసిన మినీ పార్కులకు సరైన నిర్వహణ చేపట్టి ఎప్పటికీ ఇలాగే అందంగా ఉంచేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఈదులగూడ బైపాస్‌ కూడలిలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో బోర్డు కనిపించడం లేదని..అక్కడ విద్యుద్దీపాలు అమర్చాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని