logo

మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి

కళ్ల ముందే తల్లిదండ్రులు, అక్క మరణించారు.. చెల్లెలు తనతో పాటు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుని ఇంటికి చేరుకుంది.  ఒకవైపు తల్లిదండ్రులను చూడలన్న కోరిక, మరో వైపు చెల్లెలితో మునుపటిలా ఆడుకోవాలన్న తపన.. ఇలా ఎక్కడి వెళ్లాలో తెలియక.. చెప్పటానికి మాటలు

Published : 19 May 2022 02:49 IST

28 రోజులుగా నిమ్స్‌ ఐసీయూలో చికిత్స 

కుటుంబంలో నలుగురు మృతితో అనాథగా మారిన హన్సిక

మృతురాలు బోయిళ్ల హర్షిత

కళ్ల ముందే తల్లిదండ్రులు, అక్క మరణించారు.. చెల్లెలు తనతో పాటు తీవ్రంగా గాయపడి చికిత్స తీసుకుని ఇంటికి చేరుకుంది.  ఒకవైపు తల్లిదండ్రులను చూడలన్న కోరిక, మరో వైపు చెల్లెలితో మునుపటిలా ఆడుకోవాలన్న తపన.. ఇలా ఎక్కడి వెళ్లాలో తెలియక.. చెప్పటానికి మాటలు రాక ఆ చిన్నారి 28 రోజుల పాటు ఐసీయూ లో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తూ మృత్యువుతో పోరాడుతూ ఓడిపోయింది. దేవుళ్లుగా భావించే డాక్టర్లు ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం సూదులు, కత్తులతో తన శరీరానికి కోతలు పెడుతున్నా భరించింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి తనను కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నా పెద్దనాన్న కష్టాన్ని చూసీ కన్నీటి చుక్కలనే కృతజ్ఞతగా మార్చింది. ఆయన కదిపిన ప్రతిసారి కన్నీరే సమాధానంగా ఏడ్చింది. గత నెల 21వ తేదీ హన్సిక సాయంత్రం జాతీయ రహదారిపై కోదాడ పట్టణంలోని మేళ్లచెరువు పైవంతెన వద్ద జరిగిన ప్రమాదంలో మెదడులో రక్తం గడ్డ కట్టి కోమాలోకి వెళ్లిన చిన్నారి (7) హర్షిత దీనగాథ ఇది.

-కోదాడ, న్యూస్‌టుడే

ఇన్నాళ్లు పడిన నకరం చాలనుకుందో.. ఏమో.. గురువారం నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచి తల్లిదండ్రుల వద్దకే వెళ్లిపోయింది. చెల్లెలు ఐశ్వర్యను అనాథగా మిగిల్చింది. బంధువులకు గుండెకోతను మిగిల్చింది. తాజాగా చిన్నారి మృతితో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 4కు చేరింది. మృతదేహానికి గాంధీలో పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు కోదాడ ఏఎస్‌ఐ సైదా శుక్రవారం స్వగ్రామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.    

హర్షిత

ఆపన్నహస్తం అందినా..
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బోయళ్ల హర్షిత, హన్సికను మొదట ఖమ్మం వైద్యశాలకు, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. వారిని కాపాడుకునేందుకు వారి పెద్దనాన్న అప్పులు తెచ్చి చికిత్స చేయించారు. పేద కుటుంబం కావటం తమ స్థాయికి మించి వైద్య ఖర్చులు అవుతుండటంతో బంధువులకు పాలుపోని పరిస్థితి. ప్రమాద సమయంలో అండగా ఉంటామన్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు పరుగులు తీశారు. వారి నుంచి పరామర్శలు, సానుభూతి మాటలే వినిపించాయి తప్ప సాయమందలేదు. దీంతో చిన్నారుల పెద్దనాన్న ‘ఈనాడు’ను ఆశ్రయించారు. వారి దీనగాథ, వైద్య ఖర్చులకు అవసరమైన సాయమందించాలంటూ ‘అనాథ ఆడబిడ్డలను.. ఆదుకోరూ..!’ శీర్షికన ఏప్రిల్‌ 24న కథనం ప్రచురించింది. మంత్రి కేటీఆర్‌ స్పందించి రూ. 5 లక్షల మేర ఎల్‌వోసీ మంజూరు చేశారు. చికిత్స తీసుకుని ఐశ్వర్య ఇంటికి చేరగా.. హర్షిత ఆరోగ్యం రోజురోజుకు క్షీణించసాగింది. నాలుగు రోజుల కిందట ఆమెకు మంజూరు చేసిన పరిమితి కూడా ముగిసిందని వైద్యులు బంధువులకు తెలిపారు. అప్పటి మరో రూ. లక్ష వరకు అప్పు ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే బకాయిలు చెల్లించాలని చెప్పటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అప్పు కోసం ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ఎన్‌ఆర్‌ఐ జలగం సుధీర్‌ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీష్‌రావుకు ట్విటర్‌ ద్వారా తెలపటంతో స్పందించిన మంత్రి వెంటనే ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వెంటనే బంధువులకు మృతదేహాన్ని అందజేశారు.    

హన్సిక

గ్రామంలో విషాదఛాయలు
ఒకే కుటుంబంలో నలుగురు మృతివార్త గ్రామంలో విషాద ఛాయలను నింపింది. తాజాగా చిన్నారి మృతి విషయం తెలియటంతో బాధితుల ఇంటి వద్దకు గ్రామస్థులు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ఐదుగురు సభ్యుల గల కుటుంబంలో ప్రమాదంలో నలుగురు మరణించడంతో మిగిలిన చిన్నారి హన్సిక అనాథగా మారింది. చిన్నారి ప్రస్తుతం చిలుకూరు మండలంలోని సీతారాంపురంలో అమ్మమ్మ ఇంట్లో ఉండి కోలుకుంటోంది. మంత్రులు సాయమందించిన మొత్తం కాకుండా మరో రూ. 5 లక్షలు ఖర్చు చేసినా చిన్నారి దక్కలేదని బాధితురాలి పెద్దనాన్న రాంబాబు ‘న్యూస్‌టుడే’ మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని