logo

యాదాద్రిలో శ్రీదేవీ నవరాత్రోత్సవాలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉత్సవాల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేపట్టినట్లు 

Published : 26 Sep 2022 04:24 IST

ఉత్సవ ఆరాధనలకు ముస్తాబైన అమ్మవారి ఉపాలయం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. కొండపైన అనుబంధంగా కొనసాగుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈ ఉత్సవాల నిర్వహణకు తగు ఏర్పాట్లు చేపట్టినట్లు ఆలయ ఈవో గీత వెల్లడించారు. విజయదశమి పండగకు ముందస్తుగా దేవీ నవరాత్రోత్సవాలు శాస్త్రోక్తంగా జరపడం ఈ క్షేత్ర ఆచారం. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి (సోమవారం) మొదలయ్యే ఉత్సవాలు విజయదశమి నాటి వరకు కొనసాగుతాయి. ఈ క్షేత్రాభివృద్ధిలో భాగంగా పునర్నిర్మితమైన శివాలయంలో ఈ వేడుకల నిర్వహణతో పాటు బతుకమ్మ పండగ చేపట్టేందుకు దేవస్థానం నిర్ణయించింది.

శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు సోమవారం ఉదయం గణపతి పూజతో శ్రీకారం చుడతారు. పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, రుత్విక్‌ వర్ణం, ప్రాతఃకాల పూజ, అఖండ దీపారాధన, అంకురారోపణం జరిపి కలశ స్థాపన నిర్వహిస్తారు. సాయంత్రం వేళ దేవీ నవరాత్రి పూజ చేపట్టి, సప్తశతీ పారాయణం, త్రిశతీ ఖడ్గమాల అష్టోత్తర శతనామార్చన నిర్వహించనున్నట్లు శివాలయం ప్రధాన పూజారి తెలిపారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలతో అలంకార వేడుక నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకల నిర్వహణకై అమ్మవారి ఉపాలయాన్ని ముస్తాబు చేశారు.

పూజలో.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఉత్సవాల సందర్భంగా చేపట్టే దేవీ పూజలో పాల్గొను భక్తదంపతులు రూ.1,116 చెల్లించాలని, ఒక రోజు సప్తశతీ పారాయణంలో రూ.116 లు చెల్లించి పాల్గొనవచ్చని ఆలయ ఈవో గీత తెలిపారు.

నారసింహుడి సన్నిధిలో ఆరాధనలు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: గర్భాలయంలో మూలవరులకు పంచామృతంతో అభిషేకం, దర్శనమూర్తులకు తులసీ, స్వర్ణ పుష్పారాధన.. మహాముఖమండపంలో యజ్ఞమూర్తులకు అష్టోత్తర పర్వాల నిర్వహణతో యాదాద్రీశుల సన్నిధి ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఆదివారం బతుకమ్మ పండగ తొలి రోజైన సందర్భంగా వేకువజామున సుప్రభాతం నిర్వహించిన ఆలయ పూజారులు స్వయంభువులను మేల్కొలిపి ఆస్థాన పర్వాలను నిర్వహించారు. ప్రాకార మండపంలో హోమం, నిత్య కల్యాణం చేపట్టి గజవాహనోత్సవం నిర్వహించారు. హోమాది పూజ, కల్యాణ కైంకర్యాల విశిష్టతను ఆర్జిత భక్తులకు వివరించారు. సాయంత్రం వేళ అలంకార, దర్బారు సేవోత్సవాలను చేపట్టారు. రాత్రివేళ ఆరాధన, సహస్ర నామార్చన చేపట్టారు. మహాలయ అమావాస్య సందర్భంగా కొండపై గల శివాలయంలో ఆరాధనలు విశేషంగా కొనసాగాయి.

రద్దీ సాధారణం.. బతుకమ్మ పండగ, అమావాస్య కావడంతో భక్తుల రాక గణనీయంగా తగ్గింది. వారాంతపు రోజైన ఆదివారం రద్దీ తగ్గడంతో మండపాలు, దర్శన వరుసల సముదాయాలతో సహా ఆలయ మాడవీధులు వెలవెలబోయి కనిపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని