logo

ఇక బలమిచ్చే బియ్యం

నిరుపేదలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి  ‘పోషకాలతో మిళితమైన బలవర్ధక  బియ్యం’ ను పంపిణీ చేసేందుకు ( ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌) ఏర్పాట్లు చేస్తోంది.

Published : 09 Feb 2023 03:22 IST

కస్టమ్‌ మిల్లింగ్‌ లెవీతో ‘ఫోర్టిఫైడ్‌ రైస్‌’ సేకరణ
మిర్యాలగూడ, న్యూస్‌టుడే

మిర్యాలగూడలో మిల్లులో ఏర్పాటు చేసిన బ్లెండింగ్‌ యంత్రం నమూనా

నిరుపేదలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి వారిని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి  ‘పోషకాలతో మిళితమైన బలవర్ధక  బియ్యం’ ను పంపిణీ చేసేందుకు ( ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌) ఏర్పాట్లు చేస్తోంది. సంచార జాతులు, నిరుపేదలు ఎక్కువగా ఉండే జిల్లాలు ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రజాపంపిణీ ద్వారా ఈ ‘ పోషకాలతో మిళితమైన బలవర్ధక  బియ్యం’ పంపిణీ చేస్తుంది. ఇతర జిల్లాల్లో అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు ఈ తరహా ఫోర్టిఫైడ్‌ బాయిల్డ్‌ రైస్‌ను సరఫరా చేస్తుండగా.. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు.. ఆ తర్వాత నిరుపేదలకు ఇచ్చే ప్రజాపంపిణీ కేంద్రాలకు వీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు.

పౌరసరఫరాలశాఖ మిల్లులకు పంపిణీ చేసిన పోషకాల బస్తాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌, రబీ ధాన్యం సేకరణ చేపడుతుండగా.. ఆయా మిల్లుల నుంచి ‘ ఫోర్టిపైడ్‌ రైస్‌ ’ను సేకరిస్తున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల నుంచి,  రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి కస్టమ్‌ మిల్లింగ్‌ చేయించే క్రమంలో ఎఫ్‌సీఐకి ఇచ్చే లెవీ విషయంలో ఫోర్టిఫైడ్‌ బియ్యం ఇచ్చేలా నిబంధనలు పెట్టారు. ప్రతి క్వింటాలు బియ్యానికి కలపాల్సిన పోషకాలను పౌరసరఫరాల శాఖ వారు మిల్లులకు ఇప్పటికే పంపిణీ చేశారు. నిర్ణీత బస్తాలలో పంపిన పోషకాలను మిల్లర్లు బియ్యంలో కలిపి ఎఫ్‌సీఐకి ఇచ్చే లెవీ పోషకాలతో కూడిన బియ్యం అందించనున్నారు. మార్చి తరువాత ప్రజాపంపిణీ ద్వారా దీన్ని పంపిణీ చేయనున్నట్లు సమాచారం.

బియ్యం మిల్లుల్లో బ్లెండింగ్‌ యూనిట్లు ఏర్పాటు

ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని బియ్యం మిల్లుల్లో ఇప్పటికే బ్లెండింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. అధునాతన మిల్లుల్లో ఇప్పటికే ఈ తరహా బ్లెండింగ్‌ యూనిట్లు ఉన్నాయి. 2024 నాటికి వందశాతం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధకమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థకు అందించే బియ్యానికి మిల్లర్లు అదనపు పోషకాలు కలుపుతున్నారు. ఈ తరహాల్లో కలిపేందుకు బ్లెండింగ్‌ యూనిట్లను నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఉమ్మడి జిల్లాలోని మిల్లుల్లో ఏర్పాటు చేస్తున్నారు. పార్‌బాయిల్డ్‌, రా మిల్లుల్లోను వీటిని ఏర్పాటు చేస్తున్నారు.

బియ్యంలో ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌-ఏ , జింక్‌ , ఇతర పోషకాలను చేర్చేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఒక క్వింటాలు సాధారణ బియ్యానికి ఒక కిలో పోషకాలను మిళితం చేస్తున్నారు. మిల్లుల్లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లెండింగ్‌ యూనిట్లతో ఒకేసారి బియ్యం తయారు చేసేలా ఏర్పాటు చేశారు.


వందశాతం పోషకాలతో కూడిన బియ్యం సేకరిస్తున్నాం

నాగేశ్వర్రావు, డీఎం పౌరసరఫరాలు, నల్గొండ

ప్రస్తుతం కస్టమ్‌ మిల్లింగ్‌ ధాన్యం నుంచి ఇచ్చే లెవీలో వందశాతం పోషకాలతో కూడిన బియ్యాన్ని సేకరిస్తున్నాం. ఈ తరహా బియ్యంను మాత్రమే ఎఫ్‌సీఐ అధికారులు లెవీగా అంగీకరించేలా ప్రభుత్వం ఆదేశించింది.  ప్రభుత్వం ఎప్పుడు ఆదేశిస్తే  అపుడు ప్రజాపంపిణీ, ప్రభుత్వ పాఠశాలలకు ఈ తరహాలో షోషకాలతో కూడిన బియ్యం సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని