logo

317 జీవో ఉపాధ్యాయులకు బదిలీలు

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో 317 జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో కింద ఉమ్మడి జిల్లా నుంచి విభజించిన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించారు.

Published : 09 Feb 2023 03:22 IST

జిల్లాలో 333 మందికి అవకాశం
సూర్యాపేట(మహాత్మాగాంధీరోడ్డు), న్యూస్‌టుడే

డీఈవో కార్యాలయంలో బదిలీల దరఖాస్తులు పరిశీలిస్తున్న విద్యాశాఖ అధికారులు

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో 317 జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జీవో కింద ఉమ్మడి జిల్లా నుంచి విభజించిన జిల్లాలకు ఉపాధ్యాయులను కేటాయించారు. ఆ ఉపాధ్యాయులు పాత జిల్లాల్లో పనిచేసిన సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీకి అవకాశం ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో వారిలో ఆనందô వెల్లివిరిసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం సూర్యాపేట జిల్లాలో 333 మంది ఉపాధ్యాయులు బదిలీకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలగనుంది.

కొత్త షెడ్యుల్‌ విడుదల

అన్ని జిల్లాలకు జనాభా ప్రాతిపదికన ఉద్యోగ, ఉపాధ్యాయులను కేటాయించాలనే సంకల్పంతో గతేడాది డిసెంబరులో రాష్ట్ర ప్రభుత్వం జీవో 317 కింద సర్దుబాటు ప్రక్రియ చేపట్టింది. ఇందులో ఉపాధ్యాయులు చాలామంది సొంత జిల్లా నుంచి పొరుగు జిల్లాకు వెళ్లారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు మాత్రమే తాజాగా చేపడుతున్న బదిలీలకు అర్హులుగా పేర్కొనడంతో వీరికి బదిలీకి అవకాశం లేకుండా పోయింది. రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారు గత నెల 28 నుంచి 31 వరకు బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా.. విద్యాశాఖాధికారులు స్వీకరించారు. దీంతో జీవో 317 ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు రావడంతో ప్రభుత్వం బదిలీ ప్రక్రియను ఆపేసి కొత్త షెడ్యూల్‌ జారీ చేసింది.

బదిలీలు ఆలస్యం!

జిల్లాలో 3.519 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇటీవల బదిలీ కోసం ఆన్‌లైన్‌లో 2,419 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఎన్‌టైటిల్‌మెంట్ పాయింట్ల ఆధారంగా బదిలీలకు సీనియార్టీ జాబితాను మంగళవారం వెల్లడించాల్సి ఉంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ జాబితాను విడుదల చేయొద్దని రాష్ట్ర అధికారులు డీఈవోలకు ఆదేశాలు ఇవ్వడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో 317 జీవో ఉపాధ్యాయులతో సీనియార్టీ జాబితాను విడుదల చేయాల్సి ఉండటంతో బదిలీ ప్రక్రియ కొంత ఆలస్యం కానుంది. ఉమ్మడి జిల్లాలో పనిచేసిన కాలానికి జీవో 317 ఉపాధ్యాయులకు సర్వీసు పాయింట్లు కేటాయిస్తుండటంతో ఇప్పుడున్న స్థానాలకు బదులుగా అనువైన స్థానాల్లో పోస్టింగ్‌ లభించనుందని వారు భావిస్తున్నారు.

సవరింపు ఇలా..

గతంలో విడుదల చేసిన కాలపట్టిక ప్రకారం మార్చి 4వ తేదీతో బదిలీల ప్రక్రియ పూర్తికావాల్సి ఉంది. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంతో సవరించిన కాలపట్టికతో మార్చి 14 వరకు కొనసాగనుంది.

* ఫిబ్రవరి 12-14 వరకు: జీవో 317 ఉపాధ్యాయుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

* 21, 22 తేదీల్లో: సీనియార్టీ తుది జాబితా ప్రకటన

* 24వ తేదీ: ప్రధానోపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులు

* 26, 27, 28 తేదీల్లో: స్కూల్‌ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

* మార్చి 4, 5 తేదీల్లో: స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ

* మార్చి 7, 8, 9 తేదీల్లో: ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి

* మార్చి 14వ తేదీ: ఎస్జీటీలకు బదిలీలు

* మార్చి 16-30వ తేదీల మధ్య: డీఈవోలు, ఆర్‌జేడీల ఉత్తర్వులపై అభ్యంతరాల సమర్పణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని