logo

పరిహారానికి సర్వే

ఉమ్మడి జిల్లాలో వడగళ్లు, అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల వర్షాలకు నిమ్మ, మామిడి తోటలు, వరి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది.

Published : 27 Mar 2023 03:16 IST

పంట నష్టపోయిన రైతుల వివరాల సేకరణ
సూర్యాపేట జిల్లాపైనే ప్రభావం ఎక్కువ

సూర్యాపేట: తిరుమలగిరిలో వరి పంటను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి రామారావు నాయక్‌, తదితరులు

సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో వడగళ్లు, అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇటీవల వర్షాలకు నిమ్మ, మామిడి తోటలు, వరి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున సాయం ప్రకటించారు. కౌలు రైతులకు సైతం పరిహారం ఇస్తామని చెప్పారు. దీంతో పంట నష్టం వివరాలు సేకరించే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. క్షేత్రస్థాయికి వెళ్లి సిబ్బంది సర్వే చేస్తున్నారు. మరో అయిదు రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. రైతుల పూర్తి సమాచారాన్ని, పంట నష్టం వివరాలను తెలుసుకోవాలని అందులో సూచించారు. విస్తీర్ణంలో అతిపెద్దదైన నల్గొండ జిల్లాలో పంటలు దెబ్బతిన్న విస్తీర్ణం తక్కువ ఉండటం రైతులకు ఊరటనిస్తోంది. ఉమ్మడి జిల్లాలో చూస్తే సూర్యాపేట జిల్లాకే నష్టం తాకిడి ఎక్కువగా ఉంది.

గ్రామాల వారీగా...

ఉమ్మడి జిల్లాలో 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తరణాధికారి, వీఏవోలు, పంచాయతీ కార్యదర్శులతో సర్వే చేపడుతున్నారు. క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ నిర్దేశిత నమూనాతో వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. రైతు పేరు, పంట విస్తీర్ణం, సర్వే నెంబర్‌, ఆధార్‌ సంఖ్య, బ్యాంకు ఖాతా తదితర వివరాలు నమోదు చేసుకుంటున్నారు. కౌలు రైతుల నుంచి సైతం ఇదే సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా వారి వద్దకే వ్యవసాయ అధికారులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు.

అభ్యంతరాలు లేకుంటే ఖరారు

ఉమ్మడి జిల్లాలో 10,988 రైతులకు సంబంధించి 23,132 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా ఎక్కడైనా పంట నష్టం వాటిల్లిన రైతులు ఉంటే వ్యవసాయ అధికారులు వారి పొలాలకే వెళ్లి పరిశీలించి నష్టం అంచనా వేయనున్నారు. సర్వే పూర్తి చేసి జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శిస్తారు. దానిపై అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిష్కరిస్తారు. లేకుంటే దానినే ఖరారు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఖరారు చేసిన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిహారం కోసం ఉన్నతాధికారులకు పంపేలా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు అందాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని