logo

సాంకేతిక సారథి.. అనువాద వారధి

ఆయన ఓ రచయిత, సాంకేతిక నిపుణుడు.. అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించింది. ఆయనే కొణతం దిలీప్‌. మోత్కూరు పురపాలిక పరిధిలోని ఆరెగూడేనికి చెందిన ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి, అంచెలంచెలుగా ఎదిగారు.

Published : 28 Jan 2024 02:16 IST

కేంద్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులు స్వీకరణ

2023, సెప్టెంబరు 21న కేంద్ర మాజీమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ చేతుల మీదుగా సోషల్‌మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకుంటున్న దిలీప్‌

మోత్కూరు, న్యూస్‌టుడే: ఆయన ఓ రచయిత, సాంకేతిక నిపుణుడు.. అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించింది. ఆయనే కొణతం దిలీప్‌. మోత్కూరు పురపాలిక పరిధిలోని ఆరెగూడేనికి చెందిన ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి, అంచెలంచెలుగా ఎదిగారు. గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖలో డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా కీలక పాత్ర పోషించి.. ఆ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌కు కుడి భుజంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగిన వెబ్‌సైట్‌ ‘మిషన్‌ తెలంగాణ’ను సృష్టించింది కొణతం దిలీపే.

ఒక దళారీ పశ్చాత్తాపంతో గుర్తింపు

కొణతం దిలీప్‌ తండ్రి బక్కారెడ్డి సీపీఐలో ఆది నుంచి ఎంతోకాలం పనిచేశారు. ఆ పార్టీ నుంచి రామన్నపేట ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారు. దిలీప్‌ హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసఫ్‌ పబ్లిక్‌ స్కూల్లో ప్రాథమిక విద్య, అక్కడే వివేకావర్ధని డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా అనుబంధ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశారు. ఈయన ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ యాన్‌ ఎకనామిక్‌ హిట్‌మ్యాన్‌’ అనే ఆంగ్ల పుస్తకాన్ని ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పేరుతో తెలుగులోకి అనువాదించారు. ఆ పుస్తకం తెలుగులో సంచలనం సృష్టించి, దిలీప్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ పుస్తకాన్ని మోత్కూరులోనే ఆవిష్కరించారు. పలుమార్లు పునఃముద్రణ కూడా అయ్యింది. కుట్రాజకీయం (అనువాదం), జంగల్‌ నామా (అనువాదం), ఏ రిబట్టల్‌ టూ విశాలాంధ్ర గోబెల్స్‌ ప్రాపగండా, ఫ్యూచర్‌ ఫర్ఫెక్ట్‌ కేటీఆర్‌ (ఆంగ్లంలో) అనే పుస్తకాలు రాశారు. తెలంగాణలో ఒక కాళరాత్రి అనే రచన చేశారు.

గూగుల్‌ ఉద్యోగం వదిలి..

కొణతం దిలీప్‌, రచయిత

మా అక్క విజయ సలహాతో 2006లో గూగుల్‌లో ఉద్యోగంలో చేరాను. 2009లో తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో స్నేహితులతో కలిసి ‘మిషన్‌ తెలంగాణ’ ప్రారంభించాను. ఆ సమయంలోనే కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావు, తెలంగాణ ఉద్యమ నేతలతో పరిచయం ఏర్పడింది. డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌గా గతేడాది వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ అభివృద్ధిని ప్రపంచానికి వివరించాను.

అందుకున్న అవార్డులు..

  • 2020 ఫిబ్రవరి 23న కొవిడ్‌-14 సమయంలో కమ్యూనికేషన్‌ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ అనుబంధ విభాగం డిజిటల్‌ మీడియా వింగ్‌కు ‘పబ్లిక్‌ రిలేషన్స్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (పీఆర్‌ఎస్‌ఐ) అవార్డు అందుకున్నారు.
  • 2021 సెప్టెంబరు 17న గోవాలో జరిగిన 15వ పీఆర్సీఐ గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ సదస్సులో కొణతం దిలీప్‌కు ‘పీఆర్సీఐ చాణక్య’ అవార్డు దక్కింది.
  • 2023 సెప్టెంబరు 21న జరిగిన గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ కాంక్లేవ్‌లో మాజీ కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌నఖ్వీ చేతులమీదుగా సోషల్‌ మీడియా పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని