logo

వారివి చుట్టపు చూపులే..!

గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది.

Published : 28 Mar 2024 05:28 IST

ఈ చిత్రం జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న జి.చెన్నారం గ్రామంలోనిది. అంతర్గత మురుగు కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు ఇళ్ల మధ్య పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. స్థానికులు రోగాల బారిన పడుతున్నా.. అటువైపు చూసే వారు కరవయ్యారు.

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్‌, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరందరూ సొంత విధులపై శ్రద్ధ చూపుతూ ప్రత్యేక అధికారుల బాధ్యతలను విస్మరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చి రెండు నెలలు పూర్తి అవుతున్నా.. కొంత మంది అధికారులు ఒకసారి కూడా వారికి కేటాయించిన గ్రామ పంచాయతీలను సందర్శించలేదు. మరి కొందరు చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారు.

అపరిశభ్రంగా పల్లెలు..  గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన చెత్త శుద్ధి కేంద్రాల నిర్వహణ పడకేసింది. పల్లెల్లో పోగైన వ్యర్థాలను డంపిగ్‌యార్డులకు తరలించి చెత్తను తడి,పొడిగా వేరు చేసి ఎరువుగా మార్చాల్సిన సిబ్బంది ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టి  దహనం చేస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో పూర్తిగా వ్యర్థాలను చెత్త శుద్ధి కేంద్రాలకు తరలించకుండానే వాగులు, వంకల్లో పారబోస్తున్నారు. దీంతో సెగ్రిగేషన్‌ షెడ్లు నిరుపయోగంగా మారాయి. మరో పక్క పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారుల సమన్వయలోపంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధిదీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, పవర్‌బోర్ల మరమ్మతులు పనులు నిలిచిపోతున్నాయి.

సమన్వయలోపం ప్రజలకు శాపం..

అత్యవసర సమయాల్లో సర్పంచులు చేతి నుంచి ఖర్చు చేసి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా వచ్చినా తర్వాత తీసుకునే వారు. నేడు ప్రత్యేక పాలనలో నిధులు వస్తేనే పనులు లేకుంటే లేదు అన్న విధంగా మారింది. పేరుకే ప్రత్యేక అధికారులు భారమంతా మాపై పడుతోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఏమైనా సమస్యలను సొంత ఖర్చుతో పరిష్కరించినా దానికి ప్రత్యేకాధికారుల నుంచి సవాలక్ష కొర్రీలు, నేతల ఒత్తిళ్లతో నలిగిపోవాల్సి వస్తోందని వెనుకడుగు వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని