logo

అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ

మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.

Updated : 29 Mar 2024 06:20 IST

వివరాలు వెల్లడిస్తున్న నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ(63) భర్త చనిపోయి కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన సిలువేరు లక్ష్మయ్య (60), నకిరేకంటి  చంద్రమోహన్‌(52) ఆమెతో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. దీంతో పాటు ఆమె వద్ద లక్ష్మయ్య రూ.1.50 లక్షలు, చంద్రమోహన్‌ రూ.లక్ష అప్పుగా తీసుకున్నారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడుగుతుండటంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నారబోయిన అంజయ్య(42) గతంలో పిచ్చమ్మ వద్ద రూ.40 వేలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించాడు. అయినా నగదు తిరిగి ఇవ్వలేదని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో మరోసారి రూ.40 వేలు చెల్లించాడు. ఈ కోపంతో ఉన్న అంజయ్య కూడా వీరికి తోడయ్యాడు. సిలువేరు లక్ష్మయ్య ఈ నెల 22న పిచ్చమ్మను గ్రామ శివారులోని నకిరేకంటి అచ్చయ్య బావి వద్దకు పథకం ప్రకారం రప్పించుకున్నాడు. ముగ్గురు కలిసి కర్రలతో తలపై కొట్టి చంపి ఆమె మెడలో ఉన్న 2.8 గ్రాముల బంగారం గొలుసు తీసుకుని ఆమెను బావిలో పడేశారు. పిచ్చమ్మ చరవాణి ద్వారా సమాచారం తెలుసుకుని ముగ్గురిని విచారించగా వాస్తవాలు అంగీకరించారు. 2.8 గ్రాముల బంగారం గొలుసు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ చెప్పారు. నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, ఎస్సై అంతిరెడ్డి, ఏఎస్సై ఆంజనేయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని