logo

లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం

క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు.

Published : 29 Mar 2024 02:26 IST

మఠంపల్లిలో క్రీస్తు మరణ ఘట్టాల ప్రదర్శన

మఠంపల్లి, న్యూస్‌టుడే: క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. కరుణామయుడి జననం విశిష్టమైంది. మరణ విధానమూ సాటిలేనిది. దయామయుని పునరుత్థానం విశ్వసనీయతను చాటిచెబుతుంది. గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పర్వదినాలు. శిలువపై తన రుధిరాన్ని(రక్తాన్ని) చిందించి దీనజనోద్ధరణ కోసం తనకు తానుగా అర్పించుకున్న రోజును గుడ్‌ఫ్రైడేగా, పరమపదించిన మూడో రోజు తిరిగి పునరుత్థానమైన ఆదివారాన్ని ఈస్టర్‌గా వ్యవహరిస్తారు. ఈ శుభ శుక్రవారం క్రీస్తు మరణించిన రోజు మాత్రమే కాదు. మానవుడు పరిశుద్ధతను పొంది నూతనంగా జీవించేందుకు మహోన్నతుడు ఓ అవకాశాన్ని ప్రసాదించిన రోజు. ద్వేషాన్ని దైవికమైన ప్రేమతోనే అధిగమించగలమన్నది మరియ తనయుని భావన. దీన్ని ఆచరణలో చూపిన ధన్యచరితుడు ఆయన. ఏసు మరణాన్ని జయించడం ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని చాటి చెప్పాడు. సిలువపై దైవకుమారుడు ప్రకటించిన నిత్య జీవం, శత్రువుని కూడా క్షమించగలిగిన సద్గుణం, ఆదరణ, ఆప్యాయత ఆచంద్రార్కం నిలిచి ఉంటాయి. మరణంలో కూడా క్రీస్తు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడో చెప్పేందుకు ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఈ రోజు క్రీస్తు కడరాత్రి విందును స్మరిస్తూ, శిష్యుల పాదాలు కడిగిన సందర్భాన్ని అనుసరిస్తూ, గెస్తమని తోటలో జరిగిన ప్రార్థనను తలచుకుంటూ చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 14 శ్రమల ధ్యానాన్ని, పుర వీధుల్లో సిలువ మార్గాన్ని అనుకరిస్తారు.


పాస్కా జాగరణ:  ఫాదర్‌ అల్లం బాలరెడ్డి, మఠంపల్లి

క్రైస్తవ విశ్వాసానికి మూలం క్రీస్తు పునరుత్థానం. పాస్కా అనే పదానికి హిబ్రూ భాషలో దాటి వెళ్లడం అని అర్థం. కడరాత్రి భోజనం ద్వారా క్రీస్తు తన శరీరాన్ని సమర్పించి రక్తాన్ని ధారపోసి దీనిని ‘నా జ్ఞాపకార్ధం చేయుడు’ అని పలికిన మాట ప్రకారమే దివ్యపూజాబలి సమర్పిస్తారు. క్రీస్తు పునరుత్థానం లేకుంటే క్రైస్తవ విశ్వాసం ఫలించదు. ప్రేమ, సత్యం, త్యాగం, సద్గుణాలకు ఉన్నతమైన ప్రమాణాలు సాధించి, జీవించి చూపిన కరుణామయుని నేను ప్రేమించకుండా ఎలా ఉండగలను అన్నారు గాంధీజీ. అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ మాటల్లో.. ‘నేను యూదుడనే.. ఆ నజరేయుని(క్రీస్తు) ప్రకాశవంతమైన ప్రేమ ప్రవాహంలో మునిగిపోయాను’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని