logo

డివిజన్లలో తిరగలేకున్నాం!

నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు సంధించిన కొన్ని ప్రశ్నలివి. మేయర్‌ స్రవంతి అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను వివరించారు. ప్రతిపక్షం

Published : 28 Jan 2022 01:17 IST

నగరపాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం

పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగాలపై వాడీవేడి చర్చ


సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు..

‘నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కాలువలు సిల్టుతో నిండిపోయాయి. గతంలో దోమల నివారణ మందైనా పిచికారీ చేసేవారు. ప్రస్తుతం అది కూడా లేదు. ప్రజలు దోమలతో అల్లాడుతున్నారు. కనీసం స్వచ్ఛమైన తాగునీరు సైతం అందించలేకున్నాం.’

‘హోర్డింగ్‌ల నుంచి పన్నులు వసూలు చేయడం లేదు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు.. హోర్డింగ్‌ నిర్వాహకులు ఏమైనా ఒప్పందాలు కుదర్చుకున్నారా! నగరంలో సమస్యల పరిష్కారానికి నిధులు లేవంటూ పదేళ్ల పాటు వాహనాలు లీజుకు తీసుకోవడం అవసరమా? ’

‘సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చినా స్పందన ఉండటం లేదు. భారీగా పన్నులు వసూలు చేస్తూ.. సమస్యలు పరిష్కరించకుంటే ఎలా? ప్రజలు అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాం. ఇలా అయితే డివిజన్లలో ఎలా తిరగాలి?’

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : నెల్లూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి తొలి సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు సంధించిన కొన్ని ప్రశ్నలివి. మేయర్‌ స్రవంతి అధ్యక్షతన గురువారం కౌన్సిల్‌ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో నగర వ్యాప్తంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను వివరించారు. ప్రతిపక్షం లేకపోవడంతో కౌన్సిల్‌లో ప్రవేశపెట్టిన 28 అజెండా అంశాలకు సభ్యులంతా ఆమోదం తెలిపారు. కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలను మేయర్‌ దృష్టికి తెచ్చారు.

పారిశుద్ధ్యంపై దృష్టేదీ?

ఆరోగ్య అధికారి హోటళ్లపై దాడులు చేయడం తప్ప పారిశుద్ధ్యం పట్టించుకోవడం లేదని 14వ డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. కార్పొరేటర్‌ షేక్‌ సత్తార్‌ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నా.. ఫాగింగ్‌ సరైన రీతిలో జరగడం లేదన్నారు. తాగునీరు, విద్యుద్దీపాలు, పారిశుద్ధ్యం తదితరాలను కూడా మెరుగుపరచలేకపోతున్నారన్నారు. 46వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేలూరు మహేష్‌, మరో కార్పొరేటర్‌ మొయిళ్ల గౌరీ ఊటుకూరు నాగార్జున వివిధ అంశౄలను ప్రస్తావించారు. కిన్నెర మాల్యాద్రి జనవరి 19వ తేదీకే ఆరోగ్య అధికారి డాక్టర్‌ వెంకటరమణ ఉద్యోగ విరమణ పూర్తయినా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. వాటికి మేయర్‌ స్పందిస్తూ.. నగరపాలక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకువెళదామన్నారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ఇంజినీరింగ్‌ విభాగానికి సూచిస్తూనే.. సంపూర్ణ సహకారం అందించాలని ప్రజాప్రతినిధులను కోరారు.

సమస్యలు చక్కదిద్దుతాం

కమిషనర్‌ దినేష్‌కుమార్‌ సమాధానాలు ఇస్తూ కార్పొరేషన్‌కు అవసరమైన జేసీబీ వంటి భారీ వాహనాల కొనుగోలుకు ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవని, అందుకే, లీజు పద్ధతిలో తీసుకున్నామన్నారు. అన్ని డివిజన్లలో వీధి దీపాలు, రోడ్లు మరమ్మతులు, ఇంటింటికి మంచినీటి కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల ఫాగింగ్‌ , డ్రెయిన్లలో పూడిక తీత, వీధుల్లో కుక్కల బెడద, రోడ్లపై పశువుల సంచారాన్ని నివారిస్తామన్నారు. ఆదిత్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న పార్కుకు గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు పెట్టాలని, పొగతోటలో నాగులమిట్ట రోడ్డు నుంచి ట్రంకు రోడ్డు వరకు ఉన్న వీధికి డాక్టర్‌ పీఎల్‌రావు పేరు పెట్టాలని కౌన్సిల్‌ తీర్మానించిందన్నారు.

ఆ పథకాలు పూర్తి చేయాలి - వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ

ప్రతిపక్షం లేని పాలకవర్గాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా తాను మాత్రమే ప్రతిపక్షంగా ఉన్నా. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా. భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకానికి కేంద్రం నిధులు అందించింది. వాటిని పూర్తి చేయాలి. రోడ్ల బాగుకు చర్యలు తీసుకోవాలి.

అప్పు గ్రాంట్‌ కింద మార్చాలి - రూప్‌కుమార్‌యాదవ్‌, డిప్యూటీ మేయర్‌

గత ప్రభుత్వ హయాంలో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి పథకాలకు 10.5 శాతం వడ్డీతో హడ్కో నుంచి రుణం తెచ్చుకున్నారు. అది కార్పొరేషన్‌కు మోయలేని భారంగా ఉంది. తాగునీటి పథకం 95 శాతం, భూగర్భ డ్రైనేజీ 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ అప్పును గ్రాంట్‌ కింద మార్చేందుకు కృషి చేయాలి అని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని కోరారు.

మాట్లాడుతున్న మేయర్‌ పొట్లూరి స్రవంతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని