logo

మన వెంకయ్య పద్మవిభూషణుడు

సింహపురి మురిసింది. జిల్లా ముద్దుబిడ్డను మరో అత్యున్నత పురస్కారం వరించింది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. దేశంలోనే రెండో అత్యున్నత పదవికి వన్నె తెచ్చిన ముప్పవరపు వెంకయ్యనాయుడును పద్మ విభూషణ్‌ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.

Updated : 26 Jan 2024 13:43 IST

ఈనాడు, నెల్లూరు: వెంకటాచలం, న్యూస్‌టుడే: సింహపురి మురిసింది. జిల్లా ముద్దుబిడ్డను మరో అత్యున్నత పురస్కారం వరించింది. గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. దేశంలోనే రెండో అత్యున్నత పదవికి వన్నె తెచ్చిన ముప్పవరపు వెంకయ్యనాయుడును పద్మ విభూషణ్‌ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది.దీంతో జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 

వీఆర్‌ కళాశాల నుంచే..

వెంకయ్యనాయుడు క్రమశిక్షణకు మారుపేరు. ఆయన ఎదిగిన తీరూ స్ఫూర్తిదాయకమే. పట్టుదల, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం.. పాటించిన విలువలు ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవిని అధిష్ఠింపచేశాయి. నెల్లూరులోని వీఆర్‌ కళాశాలలో చదివే సమయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఒక విధంగా చెప్పాలంటే.. ఇక్కడే ఆయన రాజకీయాలవైపు వెళ్లేందుకు బీజం పడింది. తొలిసారిగా వీఆర్‌ కళాశాల విద్యార్థి సంఘ ఉపాధ్యక్ష పదవిని చేపట్టి.. విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. దేశభక్తిని, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని చిన్నతనంలోనే తనలో నింపుకొన్న.. ఆయన.. తన రాజకీయ జీవితంలో సైద్ధాంతిక పోరాటం చేశారు.

గ్రామీణుల కోసం స్వర్ణభారత్‌

వెంకయ్యనాయుడు రాజకీయంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేశారు. దిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే అని నమ్మే ఆయన.. కన్నతల్లిని, మాతృభాషను, జన్మభూమినీ ఎప్పటికి మరువకూడదని తరచూ చెబుతుంటారు. చేతల్లోనూ దాన్ని చేసి చూపించారు. స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశారు.. చేస్తూ ఆదర్శంగా నిలిచారు. 2001లో కొందరు మిత్రులతో కలిసి తన మానస పుత్రిక స్వర్ణభారత్‌ ట్రస్టును ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి తదితర సేవాకార్యక్రమాలు, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 16 ఏళ్లుగా ట్రస్టు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

స్వయంసేవకుడిగా..

బడిబయట పిల్లలపై శ్రద్ధ..

బ్రిడ్జి పాఠశాల ద్వారా బడి మానిన, అనాథలైన పిల్లలను గుర్తించి.. వారిని ట్రస్టుకు తీసుకొచ్చి ఏడాది పాటు ఉచితంగా భోజనం, చదువు చెప్పిస్తున్నారు. వారికి విద్యపై ఇష్టం కలిగించి.. తిరిగి పాఠశాలల్లో చేర్చుతారు. ఈ విధంగా 14ఏళ్లుగా ఇక్కడ ఎందరినో విద్యావంతులుగా తీర్చిదిద్దారు.

పుట్టిన ప్రాంతాన్ని స్మరిస్తూ..

స్వగ్రామం అన్నా... పల్లెలన్నా వెంకయ్యనాయుడికి ఇష్టం. తాను ఎంత తీరిక లేని పనుల్లో ఉన్నా నెల్లూరుకు వచ్చిన సమయంలో తప్పకుండా స్వగ్రామానికి వెళుతుంటారు. స్థానికులు, బంధువులను కలిసి మాట్లాడుతుంటారు. అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందిస్తారు. పల్లెలపై ఎనలేని మమకారం ఉండే ఆయన.. వాజ్‌పేయీ హయాంలో పట్టుబట్టి మరీ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిత్వశాఖను తీసుకున్నారు. పుట్టి పెరిగిన చవటపాళెం, శ్రీరామపురం గ్రామాల అభివృద్ధికి చక్కటి కృషి చేశారు. వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దారు.

‘జిల్లాలో ఐఐటీటీఎం(టూరిజం అండ్‌ ట్రావెల్స్‌ మేనేజ్‌మెంట్‌) కళాశాల, దివ్యాంగుల ప్రాంతీయ కళాశాల, జాతీయ విద్యా, శిక్షణా పరిశోధన సంస్థ తదితరాలు జిల్లాకు రావడంలో విశిష్ఠ కృషి చేశారు. దీంతో పాటు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని వెంకటాచలం తీసుకువచ్చారు.’

యువకుడిగా సభలో ప్రసంగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని