logo

ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం

కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.

Updated : 29 Mar 2024 05:06 IST

పెళ్లికుమార్తె తల్లి, మరో ఇద్దరు మహిళలు మృతి

టంగుటూరు, కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. వారి సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందో ఏమో.. కొన్ని గంటల్లోనే మృత్యువు ప్రమాద రూపంలో ముగ్గురిని కబళించింది. పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. హృదయ విదారకమైన ఈ దుర్ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం శివారులో.. 16వ నంబరు జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకుంది. ప్రమాదంలో వధువు తల్లి, మేనమామ భార్య, పిన్ని కుమార్తె దుర్మరణం చెందగా- వధువు సోదరుడు, మేనమామ, మేనమామ కుమారుడు గాయాలపాలయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన రాయని అరుణ కుమార్తెకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్త పాల్వంచకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. బుధవారం రాత్రి 9 గంటలకు వరుడి స్వగ్రామంలో వివాహమైంది. ఆ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు బస్సుల్లో హాజరయ్యారు. అనంతరం వధువు తరఫు బంధువులంతా ఆయా వాహనాల్లో కందుకూరుకు తిరుగుపయనమవగా- వధువు తల్లి అరుణ, సోదరుడు వేణు, మేనమామ తలపునేని వినోద్‌, ఆయన భార్య దివ్య, కుమారుడు రామ్‌, పిన్ని కుమార్తె గుళ్లాపల్లి శ్రావణి కారులో బయలుదేరారు. గురువారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు తూర్పునాయుడుపాలెం వద్దకు వచ్చేసరికి.. వాహనం నడుపుతున్న వినోద్‌ నిద్రలోకి జారుకున్నారు. దాంతో కారు అదుపు తప్పి రోడ్డు అంచున ఉన్న  ఫెన్సింగ్‌ సిమెంట్‌ దిమ్మెలను వేగంగా ఢీకొంది. ఆ తర్వాత పల్టీలు కొడుతూ.. రెండు దిమ్మెలను ఢీకొట్టి.. మరో దిమ్మెకు తగిలి ఆగింది. దీంతో వాహనం మొత్తం నుజ్జవగా.. రాయలి అరుణ(50), తలపనేని దివ్య(28), గుళ్లాపల్లి శ్రావణి (22) తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. రాయని వేణు (27), తలపనేని వినోద్‌(35)లకు తీవ్ర గాయాలవగా.. చిన్నారి హన్విక్‌రామ్‌ (3)కు స్వల్ప గాయాలయ్యాయి. బస్సుల్లో వస్తున్న బంధువులు సంఘటనా స్థలం వద్ద ఆగి.. విగతజీవులుగా పడి ఉన్న తమవారిని చూసి శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న టంగుటూరు ఎస్సై నాగేశ్వరరావు, సింగరాయకొండ సీఐ రంగనాథ్‌, అగ్నిమాపక, జాతీయ రహదారి భద్రత, పెట్రోలింగ్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. కారులో ఇరుక్కున మృతదేహాలను అతి కష్టం మీద బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఒంగోలు డీఎస్పీ కిషోర్‌ కుమార్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


రాయని అరుణకు కుమారుడు వేణు, కుమార్తె శ్రవంతి సంతానం. కొన్నేళ్ల కిందటే భర్త విడిపోగా- అరుణ కుట్టు మిషన్‌, టిఫిన్‌ కొట్టు నిర్వహిస్తూ పిల్లలను పెద్ద చేశారు. కుమారుడు హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటున్నారు. బుధవారం రాత్రి కుమార్తె వివాహం జరిగిన అనంతరం.. కారులో కందుకూరుకు తిరుగుపయనమయ్యారు. తెల్లవారేసరికే విగతజీవిగా ఉన్న తల్లి మృతదేహాన్ని చూసి శ్రవంతి బోరున విలపించారు.


పెళ్లికుమార్తె మేనమామ కుమారుడు తలపనేని వినోద్‌.. భార్య దివ్య(30), మూడేళ్ల కుమారుడితో వివాహానికి హాజరయ్యారు. తిరుగు పయనంలో తొలుత పెళ్లి బస్సు ఎక్కారు. అంతలోనే కారులో వెళ్దామని నిర్ణయించుకుని.. ఎక్కారు. ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు, తనకు గాయాలవడంతో షాక్‌కు గురయ్యారు. ఆసుపత్రికి వెళ్లిన కొద్దిసేపటికి తేరుకుని తన భార్య, కుమారుడిని చూపించాలని బంధువులను వేడుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా చేస్తున్నారు.


గుళ్లాపల్లి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి కుమార్తె శ్రావణి(23). ఉపాధి రీత్యా కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. శ్రావణి అక్కడే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. దగ్గరి బంధువైన అరుణ కుమార్తె వివాహానికి శ్రావణి హాజరయ్యారు. కారు ప్రమాదంలో తమ బిడ్డ విగతజీవిగా మారిందన్న వార్త విన్న తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారు. బోరున విలపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు