logo

కబళించిన మృత్యువు

బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఊరన్నా.. ఊరిలో జరిగే పండగలన్నా.. ఆ కుటుంబానికి ప్రాణం.. శ్రీరామ నవమి ఉత్సవాలంటే మరీ ఇష్టం.. అందుకే అక్కడి నుంచి తరలివచ్చారు. అలా వచ్చిన వారు.

Published : 17 Apr 2024 03:32 IST

గౌరవరం వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దుర్మరణం

నుజ్జయిన కారులో నుంచి మృతదేహాలను తీస్తున్న అంబులెన్స్‌ సిబ్బంది

బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటున్నా.. ఊరన్నా.. ఊరిలో జరిగే పండగలన్నా.. ఆ కుటుంబానికి ప్రాణం.. శ్రీరామ నవమి ఉత్సవాలంటే మరీ ఇష్టం.. అందుకే అక్కడి నుంచి తరలివచ్చారు. అలా వచ్చిన వారు.. అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం కావలి రూరల్‌ మండలం గౌరవరం సమీపంలో కారు ఆగిఉన్న లారీని ఢీకొన్న ప్రమాదంలో జలదంకి మండలం చామదల ఎస్సీ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.  దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కావలి, జలదంకి, న్యూస్‌టుడే

జలదంకి మండలం చామదల ఎస్సీ కాలనీకి చెందిన దావులూరి శ్రీనివాసులు హైదరాబాద్‌లో భవన నిర్మాణ పనులకు కూలీలను సమకూర్చే కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. గ్రామంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు భార్య వరలక్ష్మి అలియాస్‌ వరమ్మ(44)తో కలిసి మంగళవారం ఉదయమే వచ్చారు. బుధవారం జరగనున్న స్వామివారి కల్యాణోత్సవంలో ఉభయకర్తలుగా పీటలపై కూర్చోవాల్సి ఉండటంతో.. అందుకు అవసరమైన వస్తువుల కొనుగోలుకు చామదల నుంచి కావలికి కారులో బయలుదేరారు. వారికి తోడుగా శ్రీనివాసులు  సోదరి గంటా లక్ష్మమ్మ(54), ఆమె కోడలు నీలిమ(24), రెండేళ్ల మనవడు నందు కారులో వస్తున్నారు.

అటు రోడ్డు బాగోలేదని..

చామదల నుంచి నేరుగా జలదంకి మీదుగా కావలికి దగ్గర దారి ఉన్నా.. అది గుంతలతో అధ్వానంగా మారడంతో.. ప్రత్యామ్నాయంగా బిట్రగుంట మీదుగా జాతీయ రహదారిపై రావాలనుకున్నారు. ఆ నిర్ణయమే.. ఆ మార్గంలోనే మృత్యువు కాపు కాసిందని ఊహించలేకపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు కావలి రూరల్‌ మండలం గౌరవరం సమీపంలో రోడ్డు అంచున ఆగి ఉన్న లారీని ఢీకొంది. రెప్పపాటు కాలంలో అందరూ విగత జీవులుగా మారారు.

ఫోన్ల ఆధారంగా...

రోడ్డు ప్రమాదంలో కారులోని వారంతా మృతి చెందడం.. మృతదేహాలు ఛిద్రమవడంతో.. వివరాలు తెలుసుకోవడం పోలీసులకు కష్టమైంది. కారులోని సంచులు, పర్సుల్లోని వివరాల ఆధారంగా ఫోన్లు చేసి.. తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాద దృశ్యం.. స్థానికులను కలచివేసింది. తల్లితో పాటు రెండేళ్ల కుమారుడి మృతదేహాలను తరలిస్తుండగా.. అందరూ కంటతడిపెట్టారు. కారు నడుపుతున్న శ్రీనివాసులు హైదరాబాద్‌ నుంచి అదే వాహనంలో వచ్చారు. ఎప్పుడూ అదే మార్గంలో కావలికి వస్తుంటారని, అనుకోని రీతిలో ఈ సారి మృత్యువు కబళించిందని బంధువులు విలపించారు.

అందరిదీ ఒకే కుటుంబం

శ్రీనివాసులుకు ముగ్గురు కుమార్తెలు. నీలిమ మొదటి సంతానం. గ్రామంలోనే ఇచ్చి వివాహం చేశారు. ప్రస్తుతం వాలంటీరుగా పని చేస్తున్నారు. నీలిమతో పాటు ఆమె బిడ్డ నందు కారు ప్రమాదంలోనే మృతి చెందారు. రెండో కుమార్తె శిరీషకూ వివాహం చేయగా.. మూడో కుమార్తె మైథిలీ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. తల్లిదండ్రులతో పాటు సోదరిని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. తమ వారి మృతదేహాలను చూసి ఆమె రోధించడం పలువురిని కంటతడి పెట్టించింది. లక్ష్మమ్మ గ్రామంలోనే ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని