logo

బేల్దారీ బేజారు

భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు.

Published : 18 Apr 2024 03:25 IST

వైకాపా పాలనలో నిర్మాణ రంగం కుదేలు
పెరిగిన ఇసుక, సిమెంట్‌, ఇనుము ధరలు

మార్కెట్‌ కూడలిలో పనుల కోసం వేచి ఉన్న బేల్దారీలు

కందుకూరు పట్టణం, గుడ్లూరు, న్యూస్‌టుడే: భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. ప్రతి రోజూ ఉదయం పొట్ట చేత పట్టుకుని పట్టణానికి పనుల కోసం వచ్చే వారికి నిరాశే ఎదురవుతోంది. దొరికిన రోజు పనికి వెళ్లి మిగిలిన రోజులు ఉసూరుమంటున్నారు. ఉదాహరణకు గుడ్లూరు మండలంలో గుడ్లూరు, రాజుపాలెం, అమ్మవారిపాలెం, పూరేటిపల్లి, చినలాటరపి, చేవూరు ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు అధికంగా ఉన్నారు. ఇక్కడ సరైన ఉపాధి లభించకపోవటంతో ఈ గ్రామాల నుంచి సుమారు పది వేల మంది వరకు హైదరాబాదు, బెంగళూరుకు వలస వెళ్లారు.

జగన్‌ విధానాలతో..

విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకుతోడు విద్యుత్తు బిల్లులు, ఇంటి పన్నులు, పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చుల ప్రభావంతో కుటుంబ అవసరాలను నెట్టుకు రాలేక కార్మికులు సతమతమవుతున్నారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన ఇసుక విధానం భవన నిర్మాణ రంగాన్ని తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. కందుకూరు పరిసరాల్లో ఇసుక ట్రక్కు గతంలో రూ.వెయ్యి ఉండగా.. గత నాలుగేళ్ల నుంచి ట్రక్కు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు పలుకుతోంది. ఇనుము గతంలో టన్ను రూ.42వేలు ఉండగా ప్రస్తుతం రూ.66వేలు ఉంది. సిమెంట్‌ బస్తాకు రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.100 పెరిగింది. ఇటుక ధర కూడా భారీగా పెరిగింది. ఇలా భవన నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో నిర్మాణాలు మందగించాయి. ప్రభుత్వం చేపట్టిన పేదలందరికీ ఇళ్ల పథకంపై అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నా అడుగు ముందుకు పడటం లేదు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.8లక్షలు ఏమాత్రం సరిపోవడం లేదు.

వర్షాల్లేక సాగుకు నోచుకోక

సరైన వర్షాలు లేక పంటలు సక్రమంగా సాగవక గ్రామాల్లో పనులు దొరికే పరిస్థితి లేదు. కందుకూరు మండలం, గుడ్లూరు, వలేటివారిపాలెం, ఉలవపాడు ప్రాంతాల నుంచి రోజు వారీ కూలీలుగా వివిధ పనుల కోసం నిత్యం వందల మంది పట్టణానికి వస్తున్నారు. ఉపాధి దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బేల్దారీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణాలకు వెళ్తున్నాం

ఎస్‌.లక్ష్మణ్, భవననిర్మాణ కార్మికుడు, గుడ్లూరు

భవనాల్లో చలువరాళ్లు పరిచే కార్మికుడిని. అయిదేళ్ల క్రితం నెలలో ఒక్క రోజు కూడా తీరిక లేకుండా పని ఉండేది. ఇప్పుడు సగం రోజులు కూడా పని ఉండటం లేదు. దీంతో పని దొరకని రోజుల్లో పట్టణాల్లో పనులకు వెళ్తున్నాం. ఇప్పుడు కూలి రూ.1000 అయినా సగం రోజులు ఖాళీ ఉండాల్సి వస్తోంది.

మూడు రోజులే..

ఎం.కోటేశ్వరరావు, గోపాలపురం

సుమారు 25 ఏళ్ల నుంచి బేల్దారీ పని చేస్తున్నా. రోజూ పట్టణానికి వచ్చి పనికి వెళ్లడం అలవాటు. గత రెండేళ్లుగా పనులు సక్రమంగా దొరకడం లేదు. వారంలో మూడు రోజులు పని ఉంటే మిగిలిన రోజులు ఖాళీగా వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. రాకపోకలకు ఛార్జీలు, భోజనం ఖర్చులకు వచ్చిన కూలీ సరిపోతోంది. ఇక కుటుంబ ఖర్చులకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

ఉపాధి దొరకడం లేదు

డి.చిన్నా, నలదలపూరు

మా గ్రామంలో పొలం పనులు ఉండటం లేదు. దీంతో బేల్దారీ పని కోసం పట్టణానికి వస్తున్నా. ఇక్కడ కూడా పనులు సక్రమంగా దొరకడం లేదు. ఇసుక, ఇనుము, సిమెంట్‌ ధరలు పెరగడంతో నిర్మాణాలు చేసేవారు తగ్గారు. నా మాదిరిగా పనులు దొరకని వారు అడ్డాలో నిత్యం ఉంటున్నారు. పని దొరికిన రోజు వచ్చే కూలి సరిపోవడం లేదు. ఇంట్లో ఇద్దరు పిల్లలు, భార్య, తల్లిదండ్రులు వారిని పోషించాలి.

ఇసుక అందుబాటులో లేక

ఎం.రాజ,గుడ్లూరు

భవన నిర్మాణ కార్మికుడిగా పదేళ్లుగా పనిచేస్తున్నా. తెదేపా హయాంలో ఇసుక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటంతో నిర్మాణ రంగం వేగంగా ఉంది. ఇప్పుడు ఇసుక ధరలు పెరగడంతో పనులు నెమ్మదించాయి. కార్మికులకు పనులు దొరకడంలేదు. ఇసుక ఉన్నప్పుడు మాత్రమే పని ఉండటంతో కొన్ని రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని