logo

పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల

ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

Published : 18 Apr 2024 03:35 IST

చెలరేగుతున్న మట్టి మాఫియా

నారంపేట ఉత్తరం వైపున్న తిప్పలను ఇష్టానుసారం తవ్వేసి తరలిస్తున్నారు. క్రమంగా అక్రమ తవ్వకాలు విస్తరిస్తున్నారు. ఇటువైపు చూసే అధికారులే లేరు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అందులో భాగంగా నిర్మించే రోడ్ల కోసం పక్కనే ఉన్న తిప్పలో తవ్వకాలు చేస్తున్నారు. వారి ధాటికి తిప్ప కరిగిపోతోంది. పనుల కోసమంటూ గుత్తేదారు తరలిస్తుండగా.. వారి మాటున అధికారమే అండగా.. మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఆత్మకూరులో కొత్తగా వెలుస్తున్న లేఅవుట్ల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని రాత్రుళ్లు యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దాంతో పారిశ్రామికవాడకు తూర్పువైపున ఉన్న తిప్పలు కరిగిపోతున్నాయి.

అనుమతులా? మాకెందుకు?

గ్రావెల్‌ తవ్వకాలకు గనులశాఖ అనుమతులు తప్పనిసరి. ఎంత లోతు? పరిమాణం? అనే వివరాలు స్పష్టం చేయాలి. ఆ సమాచారం రెవెన్యూ విభాగానికి తెలపాలి. వారు వచ్చి అనుమతులు ఉన్న ప్రాంతానికి హద్దులు చూపితే.. అందులో తవ్వుకోవాలి. ఇక్కడ అవేమీ లేవు. ఇష్టానుసారం చేస్తుండగా.. స్థానికులు విస్తుబోతున్నారు. వైకాపా అధికారం యువతకు ఉద్యోగాలు తెచ్చే పరిశ్రమలు తేకపోగా- కొల్లగొట్టి స్వాహా చేసేందుకు బాగానే ఉపయోగపడుతోందనే విమర్శలు నెలకొన్నాయి.

ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు..

ఆత్మకూరు మండలం నారంపేట పారిశ్రామికవాడ ప్రాంతంలోని తిప్పల్లో గ్రావెల్‌ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. పరిశీలించి, చర్యలు తీసుకుంటాం.

శ్రీనివాసరావు, ఏడీ, గనులు, భూగర్భవనరులశాఖ

వెంటనే పరిశీలిస్తాం

అక్కడ తవ్వకాలు చేయవద్దని గతంలోనే సూచించాం. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోసారి పరిశీలిస్తాం.

మధులత, ఆర్డీవో, ఆత్మకూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని