logo

ముమ్మరంగా సహాయక చర్యలు

అకాల వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. గురువారం రాత్రి గంట పాటు ఈదురుగాలులతో వర్షం కురవడంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కాల్వలో చెత్త పేరుకుపోవడంతో మురుగు రహదారులపైకి చేరింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు

Published : 15 Jan 2022 03:16 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం, నిజామాబాద్‌ అర్బన్‌

ఖిల్లా రోడ్డులోని మురుగు కాల్వల్లో చెత్త తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

కాల వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. గురువారం రాత్రి గంట పాటు ఈదురుగాలులతో వర్షం కురవడంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కాల్వలో చెత్త పేరుకుపోవడంతో మురుగు రహదారులపైకి చేరింది. పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో నగర పాలక సంస్థ సిబ్బందితో పాటు సంబంధిత శాఖ అధికారులు శుక్రవారం తెల్లవారుజాము నుంచే సహాయక చర్యలు చేపట్టారు. కమిషనర్‌ చిత్రామిశ్రా ఆదేశాలతో పారిశుద్ధ్య సూపర్‌వైజర్‌ సాజీద్‌ అలీతో పాటు ఐదు జోన్ల పారిశుద్ధ్య అధికారులు వారి ప్రాంతాల్లో పర్యటించారు.

చెత్త తొలగించి.. నగరంలోని ఖిల్లా, ముజాహిద్‌నగర్‌, చంద్రశేఖర్‌ కాలనీ, దుబ్బ, గౌతంనగర్‌, ఆటోనగర్‌, అర్సపల్లి, న్యాల్‌కల్‌ రోడ్డు ప్రాంతాల్లో వర్షం నీటితో మురుగు కాల్వలు నిండిపోయి చెత్తా చెదారం రోడ్లపైకి రావడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. కాల్వలో పేరుకుపోయిన చెత్తను కార్మికులు తొలగించారు. కాలనీల్లోని రహదారులు శుభ్రం చేశారు. వర్షం నీరు వెళ్లేలా కాల్వలు తవ్వారు.'

గౌతంనగర్‌లో నేలకొరిగిన విద్యుత్తు స్తంభం

సరఫరా పునరుద్ధరణ.. నిజామాబాద్‌ డివిజన్‌ పరిధిలో 22 ఎల్‌టీ, ఆరు 11 కేవీ విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఒక నియంత్రిక కాలిపోగా మరికొన్ని ప్రాంతాల్లో ఆరు నియంత్రికలు గాలికి కిందపడినట్లు అధికారులు గుర్తించారు. జిల్లా సీపీ కార్యాలయం వద్ద భారీ వృక్షం తీగలపై పడింది. దుబ్బ, అర్సపల్లి, వినాయక్‌నగర్‌, మహాలక్ష్మీనగర్‌ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గౌతంనగర్‌లో ఒక ప్రైవేటు పాఠశాల భవనం పై నుంచి రేకులు కింద పడడంతో తీగలు తెగిపోయాయి. హోర్డింగ్‌లకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోయి స్తంభాలు, తీగలపై పడ్డాయి. రహదారులపై పడిపోయిన చెట్లను కార్మికులు తొలగించారు. అవసరమైన చోట యంత్రాలను వినియోగించారు. అధికారులు వేగంగా స్పందించి వీలైనంత వరకు రాత్రిలోగానే సరఫరా పునరుద్ధరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని