logo

తాళాలెలా తీస్తున్నారు?

నిజామాబాద్‌లో నెల రోజుల కిందట కొన్న ఓ ద్విచక్రవాహనం ఇటీవల అపహరణకు గురైంది. సాధారణంగా దీని తాళం తీయడం అంత సులువు కాదని పలువురు మెకానిక్‌లు చెబుతున్నారు. అందులోనూ కొత్తదైతే మరింత క్లిష్టమని పేర్కొంటున్నారు. కానీ,

Published : 22 Jan 2022 03:30 IST

కొత్త వాహనాలు సులువుగా చోరీ
న్యూస్‌టుడే - నిజామాబాద్‌ నేరవార్తలు

నిజామాబాద్‌లో నెల రోజుల కిందట కొన్న ఓ ద్విచక్రవాహనం ఇటీవల అపహరణకు గురైంది. సాధారణంగా దీని తాళం తీయడం అంత సులువు కాదని పలువురు మెకానిక్‌లు చెబుతున్నారు. అందులోనూ కొత్తదైతే మరింత క్లిష్టమని పేర్కొంటున్నారు. కానీ, ఓ దొంగ కేవలం నిమిషంలోనే తాళం తీసి సులువుగా ఎత్తుకెళ్లడం సవాలుగా మారింది. ఇదేకాదు.. అన్ని రకాల కంపెనీ వాహనాలను చోరులు అపహరించుకెళ్తుడటంపై పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.
మరాఠా ముఠాల పనే..
మహారాష్ట్రకు చెందిన పలు ముఠాలు ద్విచక్ర వాహనాలను చోరీలు చేయడంలో ఆరితేరాయి. ఎలాంటిదైనా తాళం లేకుండానే సులువుగా స్టార్ట్‌ చేస్తున్నారు. ఆటోల్లో ఇతర వాహనాల్లో ఎక్కించి అంతరాష్ట్ర సరిహద్దును దాటిస్తున్నారు. తెల్లవారితే గాని బాధితులు తమ వాహనం పోయిన విషయాన్ని గుర్తించకపోవడంతో చివరకు పోలీసులూ ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంటోంది.
తక్కవ ధరకే..
తాజాగా ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్వాధీనం చేసుకొన్న ఓ ద్విచక్ర వాహనం ధర ఇక్కడ రూ.40 వేల పైనే ఉంటుంది. నిందితులు మాత్రం అక్కడ దాన్ని రూ.10 వేలకు విక్రయించుకొన్నారు. దర్యాప్తులో ఈ విషయం వెలుగుచూసింది.
రికవరీ అంతంతే..
బండ్ల చోరీల్లో ద్విచక్ర వాహనాల కేసులే 90 శాతం పైబడి ఉంటున్నాయి. ఏటా 350 పైచిలుకు దొంగిలించబడుతున్నాయి. ఇందులో నిజామాబాద్‌ నగరంలోనే అత్యధికంగా 200 పైచిలుకు ఉంటున్నాయి. ఏటా మాయమవుతున్న వాటిల్లో కేవలం 30-40 శాతం మాత్రమే రికవరీ అవుతున్నాయి.
భద్రత ఎలా..
పార్కింగ్‌ చేసిన వాహనాలు క్షణాల్లో మాయమవుతుండటంపై వాటి భద్రత విషయంలో యజమానులు ఆందోళన చెందక తప్పట్లేదు. తాళాలు పక్కాగా లేనివి ఎత్తుకెళ్తే వాహనదారుల నిర్లక్ష్యంగా చెప్పొచ్చు. అన్నీ పక్కాగా ఉన్న కొత్తవీ అపహరణకు గురికావడంపై సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.


కట్టడికి వ్యూహం అవసరం
 

ద్విచక్ర వాహనాల అపహరణ కేసుల్లో పోలీసులు ముందస్తు కట్టడి వ్యూహం చేపట్టాల్సిన అవసరముంది. మహారాష్ట్ర ముఠాలు, పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలి.

రాష్ట్ర సరిహద్దులు, రైల్వేస్టేషన్లలో సీసీఎస్‌ బృందాలతో గస్తీ చేయిస్తే అనుమానితులు చిక్కే వీలుంది.

రాత్రివేళల్లో అనుమానిత వాహనాలు, ఆటోలపై తిరిగే వారిని నిలువరిస్తే చాలా వరకు సత్ఫలితాలుంటాయి.

వారంలో ఒకరోజైనా రాత్రి 10 నుంచి వేకువజాము వరకు నాకాబందీ చేపడితే దొంగ వాహనాలు పట్టుబడే అవకాశం ఉంది.  

స్థానికంగా వరుసగా చోరీ కేసుల్లో ఉన్న నిందితులపై పీడీ ప్రయోగించడం ద్వారా ముఠాలను సులువుగా కట్టడి చేయొచ్చు. ఇటీవల నాలుగో ఠాణా పోలీసులు ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో అన్ని ఠాణాల పరిధిల్లో నిలువరించాల్సి ఉంది.

అక్కడ కొంటుండటంతో...
మన ప్రాంతంలో చోరీ వాహనాలను ఎవరూ కొనుగోలు చేయరు. మహారాష్ట్ర, కర్ణాటకలో మాత్రం ఎలాంటి పత్రాలు లేకున్నా కొనేస్తుంటారు. అందుకే అక్కడి ముఠాలు రాత్రికి రాత్రి ఇక్కడ చోరీ చేసి మరుసటి రోజు తమ ప్రాంతాల్లోని బజార్లలో విక్రయించేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని