logo

రెండు గంటల్లో లారీ దొంగల పట్టివేత

రూ.రెండు కోట్లు విలువ చేసే సరకుతో ఉన్న లారీని డ్రైవరు, క్లీనరే దొంగిలించి పారిపోతుండగా భిక్కనూరు పోలీసులు చాకచక్యంగా రెండు గంటల్లో పట్టుకున్నారు. జిల్లా పోలీసు అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం

Published : 23 May 2022 04:52 IST

సుమారు రూ.2 కోట్ల విలువైన సామగ్రి స్వాధీనం

భిక్కనూరు, న్యూస్‌టుడే: రూ.రెండు కోట్లు విలువ చేసే సరకుతో ఉన్న లారీని డ్రైవరు, క్లీనరే దొంగిలించి పారిపోతుండగా భిక్కనూరు పోలీసులు చాకచక్యంగా రెండు గంటల్లో పట్టుకున్నారు. జిల్లా పోలీసు అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం భిక్కనూరు పోలీసుస్టేషన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హరియాణా రాష్ట్రానికి చెందిన లారీ సుమారు రూ.2 కోట్లు విలువ చేసే అల్యూమినియం లోడుతో చెన్నై నుంచి దిల్లీకి బయలుదేరింది. శనివారం రాత్రి 9:30 గంటలకు భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులోకి రాగానే డ్రైవర్‌ సాహిద్, క్లీనర్‌ సాహిల్‌ లారీకి ఉన్న జీపీఎస్‌ను తొలగించి వాహనాన్ని, అందులోని సామగ్రిని దొంగిలించడానికి యత్నించారు. లారీ ఓనర్‌ చరవాణికి సమాచారం వెళ్లడంతో వెంటనే భిక్కనూరు పోలీసులను సంప్రదించారు. వెంటనే ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్‌ పోలీసులను సమన్వయం చేశారు. లారీ ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద సీసీ టీవీలో రికార్డవ్వడంతో భిక్కనూరు సీఐ తిరుపయ్య లారీని వెంబడిస్తూ రాత్రి 11:30 గంటలకు జక్రాన్‌పల్లి వద్ద పట్టుకున్నారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన భిక్కనూరు సీఐతోపాటు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్‌గౌడ్, ఎస్సై ఉస్మాన్, ఏఎస్సై రాజేశ్వర్‌రావు, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఎస్పీ అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని