logo

నడవాలంటే నరకమే

పెరుగుతున్న ధరలు.. నిరుద్యోగం.. ఇతర వర్తమాన అంశాలతోపాటు కుక్కలు ఒక సమస్య అయి కూర్చున్నాయి. వాటి నుంచి గట్టెక్కి ఇంటికి చేరుకుంటే.. కుక్క నుంచి తప్పించుకోవడం గగనమవుతోందని పౌరులు ఆవేదన చెందుతున్నారు. నియంత్రణ బాధ్యత నిర్వర్తించాల్సిన స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా

Updated : 28 Jun 2022 06:59 IST

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

పెరుగుతున్న ధరలు.. నిరుద్యోగం.. ఇతర వర్తమాన అంశాలతోపాటు కుక్కలు ఒక సమస్య అయి కూర్చున్నాయి. వాటి నుంచి గట్టెక్కి ఇంటికి చేరుకుంటే.. కుక్క నుంచి తప్పించుకోవడం గగనమవుతోందని పౌరులు ఆవేదన చెందుతున్నారు. నియంత్రణ బాధ్యత నిర్వర్తించాల్సిన స్థానిక సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తలనొప్పి వ్యవహారమంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో వాటి నియంత్రణ శాస్త్రీయ పద్ధతిలో కొనసాగాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారించిన హైకోర్టు ప్రతి మున్సిపాలిటీలో కుక్కల జనన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఇదీ  పరిస్థితి...
స్థానికంగా కుక్కల సంతతి వృద్ధి చెందడంతోపాటు ఆహారం దొరక్క పల్లెల నుంచి పట్టణాలకు వలసలుంటున్నాయి. పట్టణ శివార్లలోని ఫంక్షన్‌ హాళ్ల వద్ద ఆహార వ్యర్థాలు లభించినంత కాలం అక్కడ ఉంటున్నాయి. వేడుకలు లేనప్పుడు జనావాసాలకు తరలివస్తున్నాయి. పట్టణాల్లోనూ మాంసం విక్రయ కేంద్రాలు, ఆహారశాలల పరిసరాల్లో ఎక్కువగా సంచరిస్తూ క్రమంగా వీధుల్లోకి చేరుతున్నాయి. అలా వాటి సంఖ్య రెట్టింపవుతోంది. దీనికితోడు పొరుగున మహారాష్ట్ర నుంచి బలవంతపు వలసలు పెరిగిపోవడంతో సమస్య మరింత తీవ్రమైందన ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరంలో  ఒక్కటే..
ప్రస్తుతం నిజామాబాద్‌ నగరపాలక సంస్థ ఒకటే కు.ని చికిత్స కేంద్రం నిర్వహిస్తోంది. బోధన్‌, కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీమ్‌గల్‌, ఆర్మూర్‌ బల్దియాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
ఏం  చేస్తున్నారు?
నర్సాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ వ్యవహారం అధికారులందరిలోనూ భయం నింపింది. అక్కడ కుక్కలను చంపినందుకు సస్పెండ్‌ చేయడంతో నియంత్రణ చర్యల విషయంలో ఆచితూచి అడుగేస్తున్నారు. గతంలో పుర అధికారులు వాటిని పట్టుకెళ్లి ఇందల్వాయి సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేవారు. ఇది అనధికారికంగా కొనసాగిన ప్రక్రియ. నర్సాపూర్‌ ఘటనతో ఇలా తరలించే క్రమంలో ఏదైనా జరిగితే తమ మెడకు చుట్టుకుంటుందని వెనక్కితగ్గారు.
నిబంధనలేమి  చెబుతున్నాయంటే..
నర్సాపూర్‌ ఘటన నేపథ్యంలో జంతు జనన నియంత్రణ, జంతు సంరక్షణ చట్టం ప్రకారం పురపాలకశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

* శునకాలను విషం ఇచ్చి చంపొద్దు.

* సుశిక్షితులైన వ్యక్తులు గాయం కాకుండా పట్టుకోవాలి.

* కు.ని చికిత్సకు ముందు, తరువాత విశ్రాంతికి గదులు ఏర్పాటు చేయాలి.

* చికిత్సను సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేసి ఆరు నెలలు కాపాడాలి.

* కేంద్రాల్లో వాటికి సరైన పోషకాహారం ఇవ్వాలి.

* జియో ట్యాగ్‌ వేయాలి.


కు.ని శస్త్రచికిత్సలు చేస్తున్నాం
సాజిద్‌ అలీ, ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వో

కుక్కలను పట్టుకొచ్చి కు.ని ఆపరేషన్లు చేస్తున్నాం. మళ్లీ జూన్‌ 1 నుంచి శిబిరం ప్రారంభించాం. రోజుకు 5-6 వరకు ఆడ, మగ శునకాలకు చికిత్సలు చేసి ట్యాగ్‌ వేస్తున్నాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని