logo

నిర్వహణలో కొరవడిన కసరత్తు

జిల్లాకేంద్రంలో ఐదేళ్ల క్రితం పురపాలక శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. కండరాల ఆరోగ్యం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి పరికరాలు బిగించారు.

Published : 26 Nov 2022 05:03 IST

ఓపెన్‌ జిమ్‌లను గాలికొదిలేసిన పుర యంత్రాంగం

ఆకతాయిల చేతిలో విరిగిన బల్ల

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: జిల్లాకేంద్రంలో ఐదేళ్ల క్రితం పురపాలక శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వ్యాయామశాలలు ఏర్పాటు చేశారు. కండరాల ఆరోగ్యం, తేలికపాటి వ్యాయామాలు చేసుకోవడానికి పరికరాలు బిగించారు. నిర్వహణ లేక.. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో అనతికాలంలోనే పరికరాలు ధ్వంసం అయ్యాయి. కింద పరిచిన ప్రత్యేక మ్యాట్‌లను ఆకతాయిలు తొలగించారు.

కాపలాదారులు అవసరం

స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ వ్యాయామం చేసేందుకు వీలుగా రూ.లక్షలు వెచ్చించి ఓపెన్‌జిమ్‌లు ఏర్పాటు చేసినా.. రక్షణ కోసం ప్రహరీల నిర్మాణం, కాపలాదారుల నియామకం చేపట్టకపోవడంతో సమస్య ఏర్పడింది. ఫలితంగా అనేక కేంద్రాల్లో సాధకులకు ఇబ్బందులు తప్పడం లేదు.


జిల్లాకేంద్రంలోని రాజీవ్‌ఉద్యానంలో బహిరంగ వ్యాయామశాలను రూ.7 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఇక్కడికి నిత్యం ఉదయం పూట నడక, జాగింగ్‌ చేయడానికి 100 మంది వరకు వస్తుంటారు. పరికరాలు విరిగిపోవడంతో వ్యాయామం చేయడానికి వీలు లేకుండా పోయింది. పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందించడం లేదని వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు.


జిల్లాకేంద్రంలోని గోదాంరోడ్డు-పాతబస్టాండు మధ్యలో ఏర్పాటు చేసిన బహిరంగ వ్యాయామశాలలో పరికరాలు ధ్వంసమయ్యాయి. నేల మీద పరిచిన ప్రత్యేక మ్యాట్‌లను ఆకతాయిలు ఎత్తుకెళ్లారు. దీని చెంతనే ప్రకృతివనం, మినీ ఉద్యానం ఉన్నా.. నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది.


ప్రత్యేకాధికారిని నియమిస్తాం
- దేవేందర్‌, పుర కమిషనర్‌, కామారెడ్డి

బహిరంగ వ్యాయామశాలల్లో కొన్ని పరికరాలు పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు చేపడతాం. ఈ విషయమై కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలకు వసతుల కల్పనలో లోపాలకు తావివ్వకుండా పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక అధికారులను నియమిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని