logo

జనన, మరణాలు.. ఆన్‌లైన్‌లోనే

గ్రామంలో ఎవరైనా మరణిస్తే వివరాలను అంగన్‌వాడీ టీచర్‌ రికార్డులో నమోదు చేసేవారు. కుటుంబీకులు పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వక లేఖ అందించి జనన, మరణ ధ్రువీకరణ పత్రం పొందేవారు.

Published : 05 Feb 2023 05:09 IST

పంచాయతీలకూ విస్తరణ

న్యూస్‌టుడే, బోధన్‌: గ్రామంలో ఎవరైనా మరణిస్తే వివరాలను అంగన్‌వాడీ టీచర్‌ రికార్డులో నమోదు చేసేవారు. కుటుంబీకులు పంచాయతీ కార్యదర్శికి లిఖితపూర్వక లేఖ అందించి జనన, మరణ ధ్రువీకరణ పత్రం పొందేవారు. తాజాగా మారిన విధానం ప్రకారం సదరు అర్జీని మీ-సేవ ద్వారా ఆన్‌లైన్లో నమోదు చేయాలి. ఆ వివరాలు నిర్ధారించుకున్న తర్వాత పంచాయతీ కార్యదర్శి రికార్డులో నమోదు చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దాన్ని తిరిగి మీ-సేవ కేంద్రం నుంచి పొందాలి. పుర పాలికల్లో అమలు చేసిన ఈ పద్ధతిని ప్రస్తుతం గ్రామాలకు విస్తరించారు.


పారదర్శకతకు పెద్దపీట

జనన, మరణ వివరాలను కార్యదర్శి రికార్డుల్లో నమోదు చేసి ఏడాది పాటు పంచాయతీలోనే ఉంచుతారు. తర్వాత వాటిని తహసీల్దార్‌కు శాశ్వత ప్రాతిపదికన అప్పగిస్తారు. అనంతరం దస్త్రాల్లో ఉన్న వారి వివరాలతో ధ్రువపత్రాలు జారీ చేస్తారు. చాలా మందికి వీటిపై అవగాహన ఉండదు. అవసరం వచ్చినప్పుడే పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడతారు. ఏళ్ల కిందట మరణించిన వ్యక్తుల ఆధారాల సేకరణ కష్టమవుతుంది. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. వీటికి తాజా విధానం పరిష్కారం చూపనుంది. ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేసింది.


పథకాలకు లంకె

జనన, మరణాల పత్రాలు రాని పక్షంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సహా ఇతర చిక్కులకు దారితీసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు మీ-సేవలో రూ.45 రుసుం చెల్లించి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పత్రాలు తీసుకునే వీలుంది. దరఖాస్తు నంబరు ఎప్పటికీ ఆన్‌లైన్లో భద్రంగా ఉంటుంది. ఈ విధానం అధికారులను న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేయనుంది. మరణించిన వ్యక్తి పేరుతో ఒక్కసారి ధ్రువపత్రం జారీ అయితే ఎవరి ప్రమేయం లేకుండానే ఆసరా పింఛన్‌, రేషన్‌ బియ్యం, ఓటరు గుర్తింపు కార్డు రద్దవుతుంది.


శిక్షణలో లోపం

ఈ-పంచాయతీలు ఏర్పాటు చేసి కంప్యూటర్లు సరఫరా చేసినా కార్యదర్శులకు వాటి నిర్వహణలో శిక్షణ ఇవ్వలేదు. కొన్ని చోట్ల అంతర్జాల సౌకర్యం లేదు. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం పల్లెవాసులు ఆన్‌లైన్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. తాజాగా జనన, మరణ ధ్రువీకరణ వినతులు ఇలానే వస్తున్నాయి. అవగాహనలేని కార్యదర్శులు ఉన్నచోట పనివేగంపై ప్రభావం పడటంతో పాటు ప్రభుత్వ ఉద్దేశాన్ని నీరుగారుస్తున్నాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని