logo

జాడలేని సాయంత్రం క్లీనిక్‌లు

యూపీహెచ్‌సీ స్థాయిలో స్పెషాలిటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాయంత్రం క్లీనిక్‌లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. నెలకొల్పిన తర్వాత ఒకటి, రెండు నెలలలోపే మూతపడ్డాయి.

Published : 02 Jun 2023 05:56 IST

రాకాసిపేటలో సాయంత్రం క్లీనిక్‌ నిర్వహించిన యూపీహెచ్‌సీ

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం: యూపీహెచ్‌సీ స్థాయిలో స్పెషాలిటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాయంత్రం క్లీనిక్‌లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. నెలకొల్పిన తర్వాత ఒకటి, రెండు నెలలలోపే మూతపడ్డాయి. గతేడాది ఇదే సమయంలో వీటిని అట్టహాసంగా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. కానీ కొన్ని కేంద్రాల్లో క్షేత్రస్థాయిలో ఆదరణ లేకపోవడం, ఆరోగ్య మిషన్‌ నుంచి నిధుల కేటాయింపు లేక వీటిని అర్ధాంతరంగా అనధికారికంగా నిలిపివేశారు. నిజామాబాద్‌ నగరంలో మూడు, బోధన్‌లో ఒక యూపీహెచ్‌సీలో వీటిని ఏర్పాటు చేసి ఎత్తేశారు.

ఇదీ పరిస్థితి: వైద్య వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమాలకు ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. వ్యాధులు ప్రాణాంతకం కాక మునుపే ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి నియంత్రించడానికి పలు కార్యక్రమాలు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి ఈ సాయంత్రం క్లీనిక్‌. యూపీహెచ్‌సీల్లో వారంలో మూడు రోజుల పాటు క్లీనిక్‌లు నిర్వహిస్తారు. ఒక్కో రోజు ఒక స్పెషాలిటీ వైద్య నిపుణుడు అందుబాటులో ఉంటారు. వారిలో స్త్రీ, పిల్లల వైద్య నిపుణులు, ఫిజిషీయన్‌ ఒక్కో రోజు ఒకరు సేవలందిస్తారు. వీరికి ఒక రోజుకు 20 మందికి పైగా ఓపీ నమోదైతే వైద్యులకు రూ.3 వేలు, స్టాఫ్‌నర్సుకు రూ.200, నాలుగో తరగతి ఉద్యోగికి రూ.100 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. కానీ ఇక్కడికి రోగులు 20 మంది కంటే తక్కువగానే వస్తున్నారని గుర్తించారు. బోధన్‌లో మాత్రం 20కి పైగా వచ్చినట్లు చెబుతున్నారు.

సరైన వైద్యం అందే వీలు: జనం నుంచి సరైన స్పందన లేదనే భావన ఉన్నతాధికారుల్లో వ్యక్తమవడంతో వీటిని నిలిపివేశారు. ఇక చేసిన పనికి సంబంధించిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదు. ఈ విషయంలో వైద్యాధికారులను సంప్రదిస్తే స్పందించడానికి నిరాకరించారు. వైద్య నిపుణుల సేవలు స్థానికంగా అందుబాటులో ఉంటే పట్టణం, నగరంలోని మారుమూల కాలనీవాసులకు ఇవి ప్రయోజనకరంగా ఉండేవి. బస్తీల్లో పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి చేరుకునే వారు ఆ సమయంలో స్పెషాలిటీ డాక్టర్లు ఉండటంతో పరీక్షలు చేయించుకుని ప్రాథమిక స్థాయిలోనే సరైన వైద్యం అందుకునే వీలు ఉండేది. అధికారులు స్పందించి వీటిని తిరిగి తెరవాలని బోధన్‌ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని