logo

టెట్‌కు సమాయత్తం

సర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది.

Published : 28 Mar 2024 03:23 IST

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
న్యూస్‌టుడే,కామారెడ్డి పట్టణం

ర్కారు ఇటీవల మెగా డీఎస్సీ ప్రకటించింది. గత ప్రభుత్వం 2023లో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేసి అప్పటి పోస్టులకు మరిన్ని కలిపి ఇటీవల ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో డీఈడీ, బీఈడీ చదివి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో ఉత్తీర్ణత సాధించేందుకు వేలాది మంది ఉద్యోగార్థులు ప్రయత్నిస్తున్నారు.

తాజాగా షెడ్యూల్‌ విడుదల

విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇటీవలే టెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. బుధవారం నుంచి ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనుంది. మే 20 నుంచి జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. గతేడాది టెట్‌లో అనేక మంది అనుత్తీర్ణులయ్యారు. ఈ సారి పోటీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

పక్కాగా మార్గదర్శకాలు రూపొందిస్తేనే..

గ్రేడ్‌2 ఉపాధ్యాయులకు, స్కూల్‌ అసిస్టెంట్‌ల బదిలీ, పదోన్నతులకు, ఎస్జీటీలు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. సర్కారు ఇటీవల టెట్‌ ప్రకటన విడుదల చేసినా పరీక్ష రాయాలా..? వద్దా..? అనేదానిపై ఇప్పటివరకు ఉపాధ్యాయులకు స్పష్టత కరవైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతి కోసం సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ఉత్తర్వు నం.36లోని 12వ కాలమ్‌లో 2010 కన్నాముందు సర్వీసులో నియమితులైనవారికి టెట్‌ అవసరం లేదని గతంలో సర్కారు నిర్ణయించింది. ఉపాధ్యాయులు తప్పనిసరి టెట్‌ రాయాల్సి వస్తే ప్రత్యేక పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. టెట్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి డీఈవో రాజు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్ష నిర్వహిస్తామన్నారు.

గతంలో బాగా తగ్గిన ఉత్తీర్ణత

ఉమ్మడి జిల్లాలో గత టెట్‌లో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గింది. కామారెడ్డి జిల్లాలో పేపర్‌1లో 4700కి 1790 మంది(38.09 శాతం) ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌ 2లో గణితం, సామాన్యలో 1966 మందికి 347 (17.65 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సాంఘికశాస్త్రంలో 2005కి 202 (10.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. నిజామాబాద్‌ జిల్లాలో పేపర్‌1కి 12545 మంది పరీక్ష రాయగా 4483 మందికి (35.74 శాతం) అర్హత దక్కింది. పేపర్‌2లో గణితం, సామాన్యలో 5739కి 942(16.41శాతం) అర్హత సాధించగా సాంఘికలో 4662కి 485 మంది (10.04) మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని