logo

డబ్బులు ఎప్పుడొస్తాయో..!

‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్‌రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్‌ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్‌చేసుకున్నారు.

Published : 28 Mar 2024 03:25 IST

ధరణిలో స్లాట్‌ రద్దు చేసుకుని రైతుల ఎదురుచూపులు
కామారెడ్డి సంక్షేమం, న్యూస్‌టుడే

‘చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకట్‌రెడ్డి. తాడ్వాయి మండలం బ్రహ్మణపల్లి నివాసి. ధరణి పోర్టల్‌ ప్రారంభమైనప్పుడు భూమి కొనుగోలు చేద్దామని మీ-సేవకేంద్రంలో స్లాటు బుక్‌చేసుకున్నారు. రూ.31 వేల రిజిస్ట్రేషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి చెల్లించారు. భూమి డీల్‌ క్యాన్సిల్‌ కావడంతో స్లాటును రద్దు చేసుకున్నారు. సదరు స్లాటు డబ్బులు ఇప్పటికీ రాలేదు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నారు.’


​​​​​​​‘జిల్లాకేంద్రానికి చెందిన శ్రీనివాస్‌ దోమకొండ మండలంలో భూమి కొనుగోలు కోసం రెండేళ్ల క్రితం స్లాట్‌ బుక్‌ చేసుకున్నాడు. డాక్యుమెంట్‌లో ఆధార్‌ నంబరు తప్పుగా నమోదు కావడంతో భూమి రిజిస్ట్రేషన్‌ కాలేదు. తప్పులను సవరించే అవకాశం లేకపోవడంతో స్లాటు రద్దు చేసుకుని మరో స్లాట్‌ బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్నాడు. మొదట రద్దు చేసుకున్న స్లాటు డబ్బులు ఇప్పటికీ రాలేదు.’

రణి స్లాట్‌ బుకింగ్‌ డబ్బులు రైతులకు తిరిగి వాపస్‌ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దాదాపు మూడేళ్ల నుంచి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మంది రైతులు ఎదురుచూస్తున్నారు. స్లాట్‌ బుకింగ్‌ సమయంలో భూమి మార్కెట్‌ విలువను బట్టి రిజిస్ట్రేషన్‌ ఫీజును రైతులు, స్థిరాస్తి వ్యాపారులు ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారు. స్లాట్‌ రద్దు చేసుకుంటే డబ్బులు తిరిగి ఇచ్చే విధానం ధరణిలో లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోవడంతో స్లాటు రద్దు చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వ హయాంలోనైనా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

సవరణకు అవకాశం లేక..

స్లాట్లు రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణం ధరణి వెబ్‌సైట్‌లో సవరణల ఐచ్ఛికం ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది. స్లాట్‌ బుక్‌ చేసిన తర్వాత తప్పులు దొర్లడంతో చాలా మంది స్లాట్లు రద్దు చేసుకున్నారు. ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో జరిగిన పొరపాట్లను సవరించే అవకాశం లేకుండా పోయింది. అప్పట్లో పేరు, చిరునామా, ఆధార్‌ నంబరు వంటి వివరాలు ఒకసారి నమోదు చేసి సబ్‌మిట్‌ చేశాక తప్పులుంటే సవరించే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు కూడా ఆధార్‌ నంబరు సవరించడానికి ఎడిట్‌ ఆప్షన్‌ లేదు. కేవలం పేరు, చిరునామాలకు మాత్రమే ఐచ్ఛికం ఇచ్చారు. మరో కారణం ఏమిటంటే భూవిక్రయ ఒప్పదం రద్దు కావడం. విక్రయించాలనుకునే వ్యక్తి చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకోవడం లేదా ధరల విషయంలో ఇరువురి మధ్య అవగాహన కుదరక స్లాట్లు రద్దయ్యాయి.

ఖాతాలో జమ చేస్తామన్నారు

స్లాట్‌ రద్దయిన వారికి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తామని గత ప్రభుత్వం పేర్కొంది. దీంతో స్లాట్లు రద్దు చేసుకున్నవారు ధరణి పోర్టల్‌లో క్యాన్సిల్‌ ఆప్షన్‌ కింద వివరాలు నమోదు చేయించుకున్నారు. వీరందరికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగంలో డబ్బులు అందజేస్తామని చెప్పారు. కాని మూడేళ్లు గడిచినా డబ్బులు రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని