logo

కుళాయి కనెక్షన్లు.. ఆన్‌లైన్‌లో తప్పులు

పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు.

Updated : 29 Mar 2024 06:15 IST

కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న మహిళలు

న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం: పాలనలో పారదర్శకత పెంచడానికి, ప్రజలకు జవాబుదారీతనం కలిగించడానికి ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో అపసోపాలు తప్పడం లేదు. రెండున్నరేళ్లుగా ఆన్‌లైన్‌లో కుళాయి కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ మ్యానువల్‌గానే పని కానిస్తున్నారు. దీంతో అక్రమాలకు తావిచ్చే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 1363 నల్లాలు ఇచ్చారు. 2023- 24 ఆర్థిక సంవత్సరం మరో ఏడు రోజుల్లో ముగియనుంది. దీంతో ఆన్‌లైన్‌లో నీటి పన్ను చెల్లించాలకునే వారికి వివరాలు నమోదుకాక అగచాట్లు పడుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలో మూడు పురపాలక సంఘాల్లో మొత్తం 18 వేల కుళాయిలు కనెక్షన్లు ఉన్నాయి. కొన్నేళ్ల నుంచి పుర కార్యాలయాల్లోనే రుసుము తీసుకొని మ్యానువల్‌గా కుళాయిలు ఏర్పాటుచేస్తున్నారు. వార్డుల్లో వందల సంఖ్యలో ఇస్తున్నా.. అవి లెక్కల్లోకి రావడం లేదు. దీంతో మంజూరుచేసిన నల్లాలవివరాలన్నింటినీ ఆన్‌లైన్‌ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. అప్పటికప్పుడు సిబ్బందితో హడావుడిగా వివరాలు నమోదుచేయించారు. నిర్దేశిత గడువు విధించగా ఇష్టారాజ్యంగా ఆస్తి పన్ను (అసెస్‌మెంట్‌) సంఖ్యకు కుళాయి నంబర్‌ జత చేశారు. దీంతో ఒకరి నల్లా పన్ను మరొకరి ఖాతాలో పడి తప్పు దొర్లింది. దీంతో పన్నుల చెల్లింపులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

విచ్చలవిడిగా..

కౌన్సిలర్లు, చోటామోటా నాయకులు అధికారులకు చెప్పగానే ఎక్కడ కావాలంటే అక్కడ నల్లా కనెక్షన్‌ ఏర్పాటుచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రుసుము చెల్లించకున్నా దర్జాగా అమరుస్తుండడంతో బల్దియాల ఆదాయానికి గండి పడుతోందని పలువురు పేర్కొంటున్నారు. డిపాజిట్ల రూపేణా, నెలవారీ కుళాయి రుసుము చెల్లించకుండా జాప్యం జరుగుతోంది.

బాన్సువాడలో.. 0, ఎల్లారెడ్డిలో 2

కామారెడ్డిలో ఆన్‌లైన్‌ పద్ధతిన కుళాయిల మంజూరు పర్వాలేదనించినా.. బాన్సువాడ, ఎల్లారెడ్డి బల్దియాల్లో అధ్వానంగా ఉంది. నాలుగేళ్లలో కేవలం 2 కనెక్షన్లు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయమై రెవెన్యూ విభాగ అధికారి జానయ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పాత నల్లాల వివరాలు ఆన్‌లైన్‌ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. తప్పిదాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని