logo

స్తబ్దుగా సలహా సంఘాలు

ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది.

Published : 29 Mar 2024 05:09 IST

ఈనాడు, కామారెడ్డి: ప్రజల భాగస్వామ్యంతో ఆయా శాఖల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం సలహా సంఘాలను(అభివృద్ధి కమిటీలు) ఏర్పాటు చేస్తుంది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తాజాగా గ్రామాల్లో ఇందిరమ్మ, ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల నియామకాలు కొనసాగుతున్నాయి. గతంలోనూ ఆసుపత్రులు, పాఠశాలలు, రైతుబంధు, పౌరసరఫరాలు, పురపాలికల్లో వార్డు కమిటీలు, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో స్థానికులను భాగస్వాములు చేస్తూ కమిటీలు ఏర్పాటయ్యాయి. పాలకులు, అధికారులు పట్టించుకోక ఇవి కాస్తా నియామకాలకు పరిమితమవుతున్నాయి. నెలల తరబడి సమావేశాలు నిర్వహించకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. ప్రస్తుతం ఏర్పాటవుతున్న కమిటీలైనా క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరముంది.

వ్యవసాయ  సాంకేతిక కమిటీలు డీలా..

సాగు, పాడిరంగంలో కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీలు ఏర్పాటుచేశారు. ఇందులో నియోజకవర్గస్థాయి ఉత్తమ రైతులను సభ్యులుగా చేర్చారు. ఆత్మ ఆధ్వర్యంలోని కమిటీలు రైతులకు సూచనలివ్వాలి. కానీ ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలు లేవు.

ఆసుపత్రుల్లో  ఇలా..

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించటమే లక్ష్యంగా పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా దవాఖానాల్లో ప్రభుత్వం సలహా సంఘాలు ఏర్పాటుచేసింది. పీహెచ్‌సీ, ఏరియా ఆసుపత్రులకు ఎమ్మెల్యేలు అధ్యక్షుడిగా, జిల్లా ఆసుపత్రులకు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ను అధ్యక్షుడిగా నియమించింది. ఇందులో ప్రజాప్రతినిధులు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా తీసుకుంది. కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో సలహా సంఘం సమావేశాలను ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో రెండు సార్లు మాత్రమే సమావేశాలు నిర్వహించి మిగిలిన దఫాలు నిర్వహించినట్లు కాగితాల మీద రాసుకున్నారని ఆరోపించారు.

ప్రజాపంపిణీ  తీరుతెన్నులపై..

ప్రజాపంపిణీలో సక్రమంగా సరకులను ప్రజలకు చేరవేసేందుకు ఆహార సలహా సంఘాలున్నాయి. అక్రమాలకు తావివ్వకుండా కమిటీలు నిరంతరం పర్యవేక్షించాలి. జిల్లా, మండల, గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన సంఘాలు మూడు నెలలకోసారి ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరును సమీక్షించాలి.

క్రియాశీలకంగా  పనిచేస్తేనే ఫలితం

పురపాలికల్లో ప్రతి వార్డులో 16 మందితో అభివృద్ధి కమిటీలున్నాయి. ఇవి ఏర్పాటై అయిదేళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఒక్క సమావేశం ఏర్పాటుచేయలేదు. ఇదే మాదిరిగా రైతుబంధు సమన్వయ సమితి, నీటి వినియోగదారుల సంఘాలు, పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం నియమించే కమిటీలైనా శ్రద్ధపెట్టి పనిచేస్తే నియామకాలకు సార్థకత చేకూరతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని