logo

బాసరలో జంట ఆత్మహత్య ఘటనలో యువకుడి గుర్తింపు

బాసర రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

Published : 29 Mar 2024 05:15 IST

శ్రీకాంత్‌

నిజామాబాద్‌ నేరవిభాగం, న్యూస్‌టుడే: బాసర రైల్వే స్టేషన్‌లో బుధవారం రాత్రి ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. యువతి మెడలో ఉన్న ప్రైవేటు కళాశాల గుర్తింపు కార్డు ఆధారంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన నందిత(20)గా ఇప్పటికే రైల్వే పోలీసులు గుర్తించారు. యువకుడి వద్ద ఏ ఆధారాలు లభించకపోవడంతో గుర్తించేందుకు సమయం పట్టింది. యువకుడి చరవాణి పరిశీలించగా నిజామాబాద్‌ నగరానికి చెందిన సూరం శ్రీకాంత్‌(28)గా తేలింది. ఆయన కోటగల్లీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వారిది పేద కుటుంబం. తండ్రి ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. శ్రీకాంత్‌, నందిత గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని తెలిసింది. యువతి చదువులో చురుగ్గా ఉండేదని స్నేహితులు చెబుతున్నారు. యువకుడు సైతం నిజాయతీగా ఉండేవాడని స్థానికులు పేర్కొంటున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.


పెళ్లి వాహనం బోల్తా

12 మందికి గాయాలు

లింగంపేట, న్యూస్‌టుడే: లింగంపేట మండలం లింగంపల్లి (ఖుర్దు) గ్రామ సమీపంలో గురువారం కామారెడ్డి- ఎల్లారెడ్డి రహదారిపై పెళ్లి వాహనం బోల్తాపడటంతో 12 మందికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి గ్రామానికి చెందిన కొత్త కిషన్‌ కుమారుడి వివాహం స్థానిక జీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో జరిపించారు. బంధువులు ఓ వాహనంలో  లింగంపల్లి నుంచి ఫంక్షన్‌ హాలుకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడినట్లు ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రమాదంలో లింగంపల్లి గ్రామానికి చెందిన కొత్త సావిత్రి, కొత్త ఆదిత్య, కొత్త కిషన్‌, రాములు, శ్రీవర్ష, సత్యవతి, వడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన తిరుపతి, రాజేశ్వర్‌, రెడ్డిపేటకు చెందిన లక్ష్మి, గాంధారికి చెందిన అంజయ్య, రాములు, అంజవ్వ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మెడికేర్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో క్షతగాత్రులు, కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి.


కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

రామారెడ్డి, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించిన ఘటన రామారెడ్డి ఠాణాలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రామారెడ్డికి చెందిన బిట్ల రవి గురువారం తెల్లవారుజామున తల్లిదండ్రులతో గొడవ పడగా వారు ఠాణాకు వెళ్లి పోలీసులను ఆశ్రయించారు. కానిస్టేబుల్‌ సిద్ధిరాములు వివరాలు ఆరా తీస్తుండగా రవి ఒక్కసారిగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఠాణాలోని అద్దాలు ధ్వంసం చేశాడు. అడ్డుగా వచ్చిన కానిస్టేబుల్‌ సిద్ధిరాములును కత్తితో గాయపర్చగా ఆయనకు చేతిపై స్వల్ప గాయమైంది. ఏఎస్సై రవీందర్‌, కానిస్టేబుల్‌ గణేష్‌లను కూడా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. గతంలోనూ పోలీసులను దూషించడంతో రవిపై  రెండు సార్లు కేసులు నమోదు చేశారు.


ఎస్సైని తోసేసిన మందుబాబులు

పెద్దకొడప్‌గల్‌: విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సైని మద్యం మత్తులో ఉన్న యువకులు తోసేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిచ్కుంద ఎస్సై మోహన్‌రెడ్డి వివరాల మేరకు...  పెద్దకొడప్‌గల్‌ మండల పరిధిలోని బేగంపూర్‌ టీరోడ్డు 161వ జాతీయ రహదారిపై ఎస్సై కోనారెడ్డి, సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా కాస్లాబాద్‌కు చెందిన 9 మంది యువకులు సమీప దాబాలో మద్యం తాగి రోడ్డు మీదకు వచ్చారు. వాహనాలు తనిఖీ చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు.


ఆర్టీసీ బస్సులో ఆర్మీ విశ్రాంత ఉద్యోగి మృతి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఆర్మీ విశ్రాంత ఉద్యోగి అస్వస్థతకు గురై మృతిచెందిన సంఘటన మెట్‌పల్లిలో గురువారం చోటుచేసుకుంది. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలానికి చెందిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి బోగం సామయ్య (70) నిజామాబాద్‌ జిల్లాలోని వినాయకనగర్‌లో స్థిరపడ్డారు. పని నిమిత్తం వీణవంక వెళ్లిన సామయ్య హుజూరాబాద్‌ డిపో బస్సులో సోదరితో కలిసి నిజామాబాద్‌ బయల్దేరాడు. మెట్‌పల్లి శివారులోని పెట్రోల్‌బంక్‌ వద్ద అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకులాడు. వెంటనే అంబులెన్స్‌కు సమాచారమివ్వగా 108 సిబ్బంది వచ్చి మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని